ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్ పర్యటనకు రాబోతున్నారు. త్వరలోనే ప్రధాని మోడీని కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయని ఈ మేరకు ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.
ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారతదేశాన్ని సందర్శించడానికి అంగీకరించారని.. రెండు వైపులా ఉమ్మడి కమిషన్ సమావేశానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు చెప్పారు. గుజరాత్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో పోలిష్‌చుక్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రభుత్వంతో సంయుక్త కమిషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఉక్రెయిన్ ఎదురుచూస్తోందని.. సహకారానికి సంబంధించిన నిర్దిష్ట రంగాలను చర్చించడానికి ఇది ఒక ప్రభుత్వ వేదికగా అభివర్ణించారు. గుజరాత్‌లో అందుబాటులో ఉన్న సామర్థ్యాలపై ప్రత్యేక ఆసక్తితో ఔషధాలు, పరిశ్రమలు, ఓడరేవు అభివృద్ధితో సహా పర్యాటక రంగానికి మించిన వ్యాపార అవకాశాలపై చర్చలు దృష్టి సారిస్తామని చెప్పారు.
గత నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. శాంతి చర్చలు జరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. ఇక ప్రధాని మోడీ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని కూడా చెప్పారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా యుద్ధం ముగించాలని ప్రధాని మోడీ కోరారు.
