Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే

Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: శివసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన భారీ ర్యాలీలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పక్ష నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శివసేన (షిండే వర్గం), బీజేపీతో పాటు పార్టీని వీడిన తిరుగుబాటు ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “నాపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ఇప్పుడే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. మీలో ఏ ఒక్క సామాన్య శివసైనికుడైనా వచ్చి ఈ పార్టీ బాధ్యతలు చేపట్టవచ్చు” అని శివసేన (యూబీటీ) అధినేత స్పష్టం చేశారు. శివసేన 60 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో తుఫానులను ఎదుర్కొందని, తాను ఎన్నటికీ పారిపోయే వ్యక్తిని కాదని, కార్యకర్తలకు కొండంత అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు.

దొంగలు, లూటీగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకుందాం..

శివసేనను దొంగలు, లూటీగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ధవ్ పిలుపునిచ్చారు. “నన్ను పదవి నుంచి దించడానికి కొందరు కుట్రలు చేశారు. ఒకవేళ నాకు కేవలం ముఖ్యమంత్రి పదవే కావాలనుకుంటే, నేను అసెంబ్లీలోనే కూర్చునేవాడిని. కానీ, నా సొంత మనుషులే నాపై వేలెత్తి చూపినప్పుడు ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగకూడదని తప్పుకున్నా” అని గత రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ద్రోహులు, అవినీతిపరులు చేసే ఆరోపణలకు శివసైనికులే తమ ఓట్లతో సమాధానం చెప్పాలన్నారు. మహారాష్ట్రలో మోడీ హవా ఉన్నప్పటికీ, ప్రజలు తమ వైపే నిలబడ్డారని ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. పెద్దగా ముఖ పరిచయం లేకపోయినా 9 మంది ఎంపీలను గెలిపించి శివసేన బలాన్ని నిరూపించారని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలోనూ పార్టీ నమ్ముకున్న నలుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారని, శివసైనికులు ఎవరూ అధైర్యపడలేదని చెప్పారు.

×
×
Ad

దేశభక్తి గురించి బీజేపీ మాకు చెప్పక్కర్లేదు..

బెంగాల్‌లో ఒక మహిళను (మమతా బెనర్జీని) ఓడించడానికి కేంద్ర బలగాలను వాడిన బీజేపీ.. మణిపూర్ ఘర్షణలను అణచడానికి ఎందుకు సైన్యాన్ని పంపడం లేదని ఉద్ధవ్ ప్రశ్నించారు. “గడిచిన 12 ఏళ్లలో పీఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) లోకి సైన్యాన్ని ఎందుకు పంపలేదు? ఒకవేళ దేశహితం కోసం సైన్యాన్ని పంపితే మేము కచ్చితంగా మద్దతు ఇస్తాం. మేమేమీ పాకిస్థానీలము కాదు. మాకు ఈ దేశంలో గొప్ప చరిత్ర ఉంది. మేం ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్లం కాదు.. ఇక్కడే పుట్టినవాళ్లం. బీజేపీ నేతల కంటే మాకే దేశభక్తి ఎక్కువ” అని మండిపడ్డారు. బీజేపీలోని నేతలంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని ఎద్దేవా చేసిన ఉద్ధవ్.. శివసేన కాంగ్రెస్‌లో విలీనమవుతుందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇన్నేళ్లు బీజేపీతో కలిసి ఉన్నప్పుడే శివసేన అందులో విలీనం కాలేదని, ఇప్పుడు వేరే పార్టీలో ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. ‘మాతోశ్రీ’ (ఠాక్రే నివాసం) పై, తమ కుటుంబంపై దాడులు జరిగినప్పుడు శివసైనికులు పడిన కష్టాలు, త్యాగాలు ఏంటో తమను చూసి ఈర్ష్యపడే ప్రత్యర్థులకు తెలియదని ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు.