Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాజౌరిలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్ కొనసాగుతుండగా.. శనివారం బారాముల్లాలోని కర్హమా కుంజర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ ప్రారంభం అయినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. బారాముల్లా ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. శనివారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఉగ్రవాదలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇరు పక్షాల మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
Read Also: GPS : ద్యావుడా.. జీపీఎస్ ఎంత పని చేసింది ?
ఇదిలా ఉంటే నిన్న ప్రారంభం అయిన రాజౌరి ఎన్‌కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ముందుగా ఇద్దరు సైనికులు మరణించగా.. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు సైనికులు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం మరణించినవారిలో నలుగురు 9 పారా(స్పెషల్ ఫోర్సెస్)కి చెందిన కమాండోలు కాగా.. ఒకరు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్స్ కు చెందిన వారు. ఏప్రిల్ 20న పూంచ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భద్రతాబలగాలు ఉగ్రవాదులను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఎన్ కౌంటర్లు ఓటు చేసుకుంటున్నాయి. బుధవారం నుంచి వరసగా నాలుగురోజులుగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
అంతకుముందు గురువారం బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదులను స్థానికులుగా గుర్తించారు. వీరిద్దరు నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నారు. షోఫియాన్ జిల్లాకు చెందిన షకీర్ మాజిద్ నజర్, హనన్ అహ్మద్ గా గుర్తించారు. 2023లో ఇద్దరూ ఉగ్రవాదంలోకి చేరారు. బుధవారం కుప్వారాలోని పిచ్‌నాడ్ మచిల్ సెక్టార్ సమీపంలో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని సైన్యం, కాశ్మీర్ పోలీసులు హతమార్చారు.