తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో నిందితులైన అత్తగారు గిరిబాలా సింగ్ న్యాయస్థానంలో వింత వాదన చేసింది. జైల్లో వార్తాపత్రిక చదవడానికి పూర్తిగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. తనకు కటింగ్‌లు కాకుండా.. పూర్తిగా పత్రిక ఇవ్వాలని డిమాండ్ చేసింది. జైలులో తనకు ట్విషా కేసుకు సంబంధించిన వార్తా కథనాలు క్లిప్పింగ్‌లతో ఇస్తున్నారని గిరిబాల సింగ్ ఆరోపించారు. తనకు పూర్తి వార్తాపత్రికను అందించాలని, అలాగే తన న్యాయవాదులను కలిసేందుకు సమయాన్ని పొడిగించాలని కోర్టును డిమాండ్ చేశారు.
జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరైనప్పుడు.. గిరిబాల సింగ్ తన ఆందోళనలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ న్యాయవాదులతో మాట్లాడటానికి తనకు, తన కుమారుడు సమర్థ్ సింగ్‌కు తగినంత సమయం లభించడం లేదని తెలిపారు. ప్రస్తుతం కేవలం 20 నిమిషాలు మాత్రమే కలవడానికి అనుమతిస్తున్నారని.. ఇది తమ కేసును అర్థం చేసుకోవడానికి చాలా తక్కువ సమయమని పేర్కొన్నారు. తమ సమావేశ సమయాన్ని పొడిగించాలని కోర్టును అభ్యర్థించారు.
జైలు యాజమాన్యం తనకు ప్రతిరోజూ ఒక హిందీ, ఒక ఆంగ్ల వార్తాపత్రికను అందిస్తున్నప్పటికీ.. అందులో పెద్ద పొరపాటు జరుగుతోందని గిరిబాల సింగ్ కోర్టుకు తెలిపారు. తన కోడలు ట్విషా మరణానికి సంబంధించిన వార్తలున్న వార్తాపత్రిక భాగాన్ని కత్తెరతో కత్తిరిస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తన కేసుకు సంబంధించిన వార్తలను కూడా చదివేందుకు తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని గిరిబాల డిమాండ్ చేస్తున్నారు.
వార్తాపత్రికతో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని కోర్టుకు తెలిపారు. పోలీసులు ట్విషా ఇంటి నుంచి ఆమెకు చెందిన కొన్ని మందులను స్వాధీనం చేసుకున్నారని.. అయితే ఆ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను ఇంకా తనకు గానీ, తన న్యాయవాదికి గానీ అందించలేదని పేర్కొన్నారు. అత్తగారి వాంగ్మూలాన్ని కోర్టు అంగీకరించింది. తదనంతరం స్వాధీనం చేసుకున్న మందుల మెమోను నిందితురాలి న్యాయవాదులకు తక్షణమే అందించాలని కోర్టు దర్యాప్తు సంస్థలను ఆదేశించింది.
మే 12న అత్త గారు గిరిబాలా సింగ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. అయితే అత్తింటి వారే తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లుగా బాధిత కుటుంబం ఆరోపించింది. దీంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తొలుత భోపాల్ ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన పోస్ట్‌మార్టం ప్రకారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది. అయితే ఈ పోస్ట్‌మార్టంపై బాధిత కుటుంబం అనుమానాలు వ్యక్తం చేశాయి. దీంతో న్యాయస్థానం ద్వారా తిరిగి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందంతో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందే ట్విషా శర్మపై గాయాలు అయినట్లుగా తేలింది. ఆమె తీవ్రంగా పెనుగులాడినట్లుగా నివేదిక వచ్చింది. దీంతో సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తు మరింత సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

