MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్

Mla Arul Vignesh Arrest

Mla Arul Vignesh Arrest

MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్‌ నేతృత్వంలోని అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)కి చెందిన కళ్లకురిచ్చి ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు సహా ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నవంబర్ 23న ఫిర్యాదు.. ఐదు సెక్షన్ల కింద కేసు
కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ నవంబర్ 23న జిల్లా ఎస్పీ ఇ. షానాజ్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. తనకు ఎమ్మెల్యే అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నవంబర్ 24న కళ్లకురిచ్చి మహిళా పోలీస్ స్టేషన్‌లో అరుల్ విఘ్నేష్‌పై ఐదు చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను తిరుప్పూర్ ఎస్పీ సృష్టి సింగ్‌కు అప్పగించారు. ఆమె గత మూడు రోజులుగా పలువురు అధికారులను, సాక్షులను విచారించారు. కేసులో భాగంగా నవంబర్ 26న జిల్లా కలెక్టర్ న్యాయమూర్తి ఎదుట రహస్యంగా వాంగ్మూలం కూడా ఇచ్చారు. దర్యాప్తును ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 27) అరుల్ విఘ్నేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గతంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, అవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.