NTV Telugu Site icon

Anurag Thakur: “తుక్డే-తుక్డే గ్యాంగ్ మైండ్‌సెట్”.. రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలపై విమర్శలు..

Anurag Thakur

Anurag Thakur

Anurag Thakur: బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ గెలుపును ఉద్దేశిస్తూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణ భారత దేశంలో గెలవదని డీఎంకే పార్టీ ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంట్‌లో వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది.

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ వసుధైవ కుటుంబం(ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సందేశాన్ని ప్రపంచానికి ఇస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ నిందిస్తున్నాయని ఆయన అన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఓడిపోవడంతో ఈవీఎంలను నిందిస్తున్నారంటూ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

Read Also: Gaumutra remark: “గోమూత్ర రాష్ట్రాలు”.. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన డీఎంకే ఎంపీ..

భారతదేశ ఐక్యతను దెబ్బతీసేందుక పక్కా ప్రణాళితో కూడిన కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అమేథిలో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటి నుంచి ఇది ప్రారంభమైందని, రాహుల్ గాంధీ వయనాడ్‌లో చేసిన ప్రకటన ఉత్తర భారతీయులను కించపరిచేలా ఉందని అన్నారు. రాహుల్ గాంధీ మాటలు శత్రుత్వాన్ని, దేశాన్ని విభజించే పనిని సూచిస్తున్నాయని అన్నారు. వారు అర్థరాత్రి తుక్డే-తుక్డే గ్యాంగ్‌ వైపు నిలబడ్డారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మేము ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనుమతించమని స్పష్టం చేశారు. తుక్డే-తుక్డే ఆలోచనలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

‘‘రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు నా ప్రశ్న ఏమిటంటే, దేశాన్ని విభజించే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తోంది? మీరు కొన్నిసార్లు కులతత్వాన్ని మరియు కొన్నిసార్లు ప్రాంతీయతను వ్యాప్తి చేస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రజలపై పదే పదే ఎందుకు దాడులు చేస్తున్నారు? మీ మిత్ర పక్షాలు ఉత్తర భారతీయులపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తుంటాయి, మీరు మౌనంగా ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు మౌనంగా ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తోంది?’’ అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు చేసిన వ్యాఖ్యలు ముందస్తుగా సిద్ధం చేసినవే అని.. కాంగ్రెస్ సభ్యులు వెనక ఉండీ దాని మిత్ర పక్షాలతో ఇలా వ్యవహరిస్తున్నారంటూ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.

Show comments