NTV Telugu Site icon

Kangana ranaut: రాహుల్‌గాంధీపై కంగనా ఘాటు వ్యాఖ్యలు.. ప్రమాదకర వ్యక్తి అంటూ వ్యాఖ్య

Rahulgandhikanganaranaut

Rahulgandhikanganaranaut

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రధాని కాలేదన్న నిరాశలో దేశ ఆర్థిక పరిస్థితిని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదికను ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్‌ మార్కెట్‌‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగమైనవి కావన్నారు. ప్రజలు ఆయనను ఎప్పటికీ గెలిపించరని… ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్‌ నివేదికపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. సెబీ పవిత్రత దెబ్బతిందని విమర్శించారు. ఛైర్‌పర్సన్‌ మాధవీ పురిపై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత మసకబారిందని.. దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేస్తున్నారన్నారు. సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? ఒకవేళ ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే.. ఎవరు జవాబుదారీగా ఉంటారు? ప్రధాని మోడీనా? సెబీ ఛైర్‌పర్సనా? లేదా అదానీనా? ఈ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి సుమోటోగా పరిశీలిస్తుందా? అని ‘ఎక్స్‌’ వేదికగా ప్రతిపక్ష నేత ప్రశ్నలు సంధించారు.

అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి అవకతవకలకు పాల్పడ్డారని, అలాగే మారిషస్‌ ఫండ్స్‌లో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఇటీవల అమెరికా షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ తాజాగా ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను మాధబి పురి ఖండించారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని వెల్లడించారు.