H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తమ తల్లిదండ్రుల్ని, కుటుంబాలను కలవడానికి వచ్చిన వారు, పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారు అయోమయ స్థిలో పడ్డారు. తమ వివాహాలను రద్దు చేసుకుని, మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు. హెచ్1బీ వీసాల రుసుము 1,00,000 డాలర్లు(రూ. 88 లక్షలు)కు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టాడు. ఈ నిర్ణయంతో భారతీయ టెక్కీల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా, అమెరికా ఇస్తున్న ఈ తరహా వీసాల్లో 70 శాతం భారతీయులు ఉన్నారు.
ట్రంప్ నిర్ణయం వల్ల విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులు వెంటనే తిరిగి రావాలని అమెరికన్ టెక్ దిగ్గజ కంపెనీలు చెప్పడంతో, చాలా ఏళ్ల తర్వాత భారతదేశానికి వచ్చిన వారు వెంటనే అమెరికా వెళ్తున్నారు. తమ సెలవులను తల్లిదండ్రులతో, తమ వారితో ఎంజాయ్ చేద్ధాం అనుకున్న వారి కళ్ల వెంట కన్నీరు వచ్చింది. వారి తల్లిదండ్రులు తమ కొడుకు లేదా కూతురు తమతో కొంత కాలం ఉంటారు అని అనుకున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో హఠాత్తుగా అమెరికా వెళ్తుండటంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు.
Read Also: Trump: నాకు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాల్సిందే.. భారత్-పాక్ సహా 7 యుద్ధాలను ఆపాను..
ట్రంప్ నిర్ణయంతో ఒత్తిడికి గురైన ఒక రెడ్డిట్ యూజర్ ‘సారామూచ్’ తన పోస్టులో బాధను తెలియజేశారు. అమెరికా బయట ఉన్నవారు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. ‘‘ వాళ్లకు కరుణ, జాలి లేదు, ఇది మీకు సిగ్గుచేటు. కొన్ని ఏళ్ల తర్వాత నన్ను చూడాలని, నాతో సమయం గడపాలని అనుకుంటున్న నా తల్లి ఏడవడం మీరు చూడాల్సి అవసరం లేదు’’ అని ఆమె చెప్పింది. మా కుటుంబాలను విడిపోవడం, ఎంతో భావోద్వేగ బాధను కలిగించిందని రెడ్డిట్‌లో పేర్కొంది.
ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాలో ఉన్న హెచ్1బీ వీసాదారులు అమెరికాను వదిలి వెళ్లొద్దని వారి కంపెనీలు సూచించాయి. దీని వల్ల చాలా వరకు ప్రయాణాలు క్యాన్సల్ అయ్యాయి. ఇందులో తమ సొంత పెళ్లిళ్లకు వెళ్లే వారు కూడా ఉన్నారు. వీరు ఇప్పుడు తమ వివాహాలను అనిశ్చిత పరిస్థితుల మధ్య రద్దు చేసుకుంటున్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో తమ జీవితాలు సాఫీగా సాగే అవకాశం ఉందా..? అనే అనుమానం సగటు భారతీయ టెక్కీల్లో నెలకొంది.