మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడికి ప్రయత్నించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమెరికా బలగాలపై జరిగిన ఈ దాడికి గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌కు తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.
బుధవారం ఫాక్స్ న్యూస్‌కు ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తామని… అమెరికా దాడులకు వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అయితే ట్రంప్‌తో జరిగిన పూర్తి ఇంటర్వ్యూను ప్రసారం చేయలేదు. ఆయన వ్యాఖ్యలను ఫాక్స్ న్యూస్ ప్రతినిధి ప్రసారంలో వెల్లడించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇరాన్ భూభాగం నుంచి అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. అమెరికా బలగాలపై ఆకస్మిక దాడికి ఇరాన్ ప్రయత్నించిందని సెంట్కామ్ ఆరోపించింది. అయితే లక్ష్యాలను చేరుకోకముందే అన్ని క్షిపణులను అమెరికా రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది.
‘‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు ఇరాన్ నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి.. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా బలగాలపై ఆకస్మిక దాడికి ప్రయత్నించాయి’’ అని సెంట్కామ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. అయితే క్షిపణుల లక్ష్యం ఏంటో సెంట్కామ్ అధికారికంగా వెల్లడించలేదు. అమెరికా అధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది.
ఇరాన్ క్షిపణి దాడితో అమెరికా సైనికులకు స్పందించేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం మాత్రమే లభించినట్లు సమాచారం. క్షిపణులు దూసుకొస్తున్న సమయంలో అమెరికా సైనికులు వాటి కదలికలను ప్రత్యక్షంగా గుర్తించి, సమన్వయంతో వాటిని కూల్చివేశారని ట్రంప్ తెలిపారు. క్షిపణులు స్థావరాన్ని చేరకుండా అమెరికా రక్షణ వ్యవస్థలు వేగంగా స్పందించాయని, ఇరాన్ ప్రయోగించిన ఏ క్షిపణి కూడా లక్ష్యాన్ని చేరలేదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇరాన్ మద్దతు ఉన్న ఇరాక్ షియా మిలీషియా స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా రాత్రిపూట దాడులు నిర్వహించిన అంశంపైనా ట్రంప్ స్పందించారు. ఈ ఆపరేషన్‌ను ఇరాక్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని నిర్వహించామని పేర్కొన్నట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ బృందాలపై మరిన్ని చర్యలు తీసుకునే అంశాన్ని కూడా అమెరికా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా బలగాలతో కలిసి దాడుల్లో పాల్గొన్నట్లు సౌదీ అరేబియా కూడా అంగీకరించింది. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని దేశాలు పరిమిత స్థాయిలో సహకరించినట్లు తెలుస్తోంది. బందర్ అబ్బాస్ తీర నగరం పరిసరాల్లోని ఇరాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపట్టినట్లు సమాచారం.
తాజా క్షిపణి దాడి, అమెరికా ప్రతీకార హెచ్చరికల నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ.. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దౌత్య చర్చలు మాత్రం పూర్తిగా నిలిచిపోలేదు. మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో అమెరికా వరుసగా 13 రోజుల పాటు నిర్వహించిన బాంబు దాడుల అనంతరం ఈ చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు కొనసాగేందుకు అవకాశం ఇస్తామని ట్రంప్ పేర్కొన్నట్లు ఫాక్స్ న్యూస్ తెలిపింది. హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే తాజా క్షిపణి దాడి నేపథ్యంలో ఈ చర్చల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.

