Gaza Crisis: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తర్వాత దెబ్బతిన్న గాజాలో పాలన, పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లోకి భారతదేశాన్ని ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా ప్రధానమైన బోర్డుకు అధ్యక్షత వహిస్తుండగా, పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ గాజా పాలన బాధ్యతల్ని చూస్తుంది, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సలహాదారు పాత్రను పోషించే మరో విభాగంగా ఉంది. 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో భాగంగా జనవరి 15న ఈ బోర్డును ఏర్పాటు చేశారు.
Read Also: Virat Kohli: న్యూజిలాండ్‌పై విధ్వంసం.. సెంచరీతో చెలరేగిన కోహ్లీ
భారతదేశానికి ఇజ్రాయిల్, పాలస్తీనాలో మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్ ఇజ్రాయిల్ మధ్య స్నేహంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. దెబ్బతిన్న గాజాకు మానవతా సహాయం పంపిన మొదటి కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. ఇదిలా ఉంటే, గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’లో చేరడానికి ట్రంప్ నుంచి ఆహ్వానం అందిందని అటు పాకిస్తాన్ కూడా ప్రకటించింది. అయితే, భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గాజా భవిష్యత్తు కోసం పాకిస్తాన్ ఎలాంటి పాత్ర పోషించినా ఇజ్రాయిల్‌కు ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
ట్రంప్ ఆహ్వానంపై ప్రపంచదేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. దాదాపుగా 60 దేశాలకు ఆహ్వానాలు పంపబడ్డాయి. ఇప్పటి వరకు హంగేరి మాత్రమే అంగీకరించింది. ఈ బోర్డు ఏర్పాటు ఐక్యరాజ్యసమితి పాత్రకు భంగం కలిగించవచ్చని యూరప్ దేశాల దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డులో టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, ఐక్యరాజ్యసమితి మిడిల్ ఈస్ట్ శాంతి సమన్వయకర్త సిగ్రిడ్ కాంగ్, యూఏఈ మంత్రి రీమ్ అల్ హషిమీ, ఖతార్-యూఏఈ అధికారులు ఉన్నారు. ఇజ్రాయిల్-సైప్రస్ వ్యాపారవేత్త యాకిర్ గాబే కూడా బోర్డులో ఉన్నారు. అయితే, బోర్డు కూర్పుపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. టర్కీ, ఖతార్ ప్రతినిధులు ఉండటాన్ని ఇజ్రాయిల్ వ్యతిరేకిస్తోంది.
