NTV Telugu Site icon

Tahawwur Rana: ముంబై దాడుల ఉగ్రవాదిని భారత్‌కి అప్పగించేందుకు ట్రంప్ ఆమోదం..

Tahawwur Rana

Tahawwur Rana

Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్‌కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. వైట్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘2008 ముంబై ఉగ్రదావ దాడి కుట్రదారుల్లో ఒకరైన (తహవ్వూర్ రాణా)ను, ప్రపంచంలోని అత్యంత దుర్మార్గులలో ఒకరిని భారతదేశంలో న్యాయం ఎదుర్కొనేందుకు అప్పగించడానికి మా పరిపాలన ఆమోదం తెలిపిందని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను. అతను న్యాయం ఎదుర్కొనేందుకు భారతదేశానికి తిరిగి వెళ్తున్నాడు’’ అని ట్రంప్ అన్నారు.

Read Also: Donlad Trump: ‘‘బంగ్లాదేశ్‌ని మోడీ వదిలేస్తున్నా’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ముంబై ఉగ్రవాద దాడుల్లో దోషిగా తేలిన రాణా ప్రస్తుతం అమెరికా లాస్ ఏంజిల్స్ జైలులో ఉన్నారు. రాణాను అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్ మూలానికి చెందిన కెనెడియన్ పౌరుడైన రాణా, ఉగ్రవాద దాడుల్లో కీలక వ్యక్తి అయిన ‘‘దౌద్ గిలానీ’’గా పిలువబడే పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డెవిడ్ కోల్మన్ హెడ్లీతో సంబంధం కలిగి ఉన్నాడు. దాడుల కోసం హెడ్లీ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు సాయం చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పుని ఎదుర్కోవడానికి భారత్, అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా కలిసి పనిచేస్తాయి అని ట్రంప్ అన్నారు. నేరస్థుల అప్పగింతకు అనుమతి ఇచ్చినందుకు ట్రంప్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలు వివిధ రంగాల్లో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలు జరిగాయి.