India Canada Conflict: ఇండియా కెనడాల మధ్య సంబంధాలు రోజురోజుకి దిగజారుతున్నాయి. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఈ హత్యలో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో వివాదం మొదలైంది. ఇటీవల భారత దౌత్యవేత్తలకు కూడా ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో, మన దేశానికి చెందిన దౌత్యవేత్తల్ని పిలిపించుకున్నాం. ఇదే విధంగా మనదేశంలో ఉన్న కెనడియన్ దౌత్యవేత్తలు ఆరుగురిని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాం.
Read Also: Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..
ఇదిలా ఉంటే మరోసారి కెనడా ప్రభుత్వం భారత్‌పై నోరు పారేసుకుంది. కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత హోంమంత్రి అమిత్ షా టార్గెట్ చేశారని ఆ దేశ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ ఆరోపించారు. కెనడాలో ఖలిస్తానీవాదులపై దాడులకు, హింస వెనక భారత హోం మంత్రి అమిత్ షా హస్తం ఉందని కెనడా ఆరోపించింది. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని కెనడాలో తదుపరి కార్యకలాపాలను నిర్వహించకుండా నిరోధించాలని భారత్‌ని కోరింది.
అమిత్ షాపై వచ్చిన ఆరోపణలపై.. ‘‘కెనడా ప్రధాని తన ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారని’’ అని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మంగళవారం జరిగిన కెనడియన్ స్టాండింగ్ కమిటీ విచారణలో, మోరిసన్ మాట్లాడుతూ, పాత్రికేయులు తనకు ఫోన్ చేసి, ఆ వ్యక్తి(అమిత్ షా) ఉన్నాడా..? లేదా..? అడిగారని, తాను అతను ఉన్నాడని ధృవీకరించానని చెప్పారు. కెనడాలోని సిక్కు వేర్పాటువాదులపై నిఘా సేకరణ కార్యకలాపాలు, దాడులకు అమిత్ షా అధికారం ఇచ్చారని, కెనడా అధికారులు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో చెప్పారని వాషింగ్టన్ పోస్ట్‌లోని నివేదిక పేర్కొంది.