NTV Telugu Site icon

Teesta water issue: తీస్తా నది సమస్యపై ఇండియా కూటమి మద్దతు కోరిన మమతా బెనర్జీ..

Teesta Water Issue

Teesta Water Issue

Teesta water issue: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండు రోజుల క్రితం భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. తీస్తా నది నీటి నిర్వహణపై మోడీ-హసీనాలు చర్చించారు. అయితే, దీనిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం తీరును అడ్డుకునేందుకు ఇండియా కూటమి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. తీస్తా నదీ జలాల విషయలో పశ్చిమ బెంగాల్‌ని చర్చల నుంచి తప్పించడంపై ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై ప్రధాని మంత్రికి లేఖ రాయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మోడీ, హసీనాలు తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ, 1996 గంగా జల ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై చర్చించారు. బంగ్లాదేశ్‌లోని తీస్తా నది పరిరక్షణ, నిర్వహణ, చర్చల కోసం సాంకేతిక బృందం త్వరలో బంగ్లాదేశ్ సందర్శిసుందని ప్రధాని నరేంద్రమోడీ మీడియా ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద తీస్తా నది నీటిని నిర్వహించడానికి, సంరక్షించడానికి భారత్ పెద్ద రిజర్వాయర్లు, సంబంధిత మౌళిక సదుపాయాలను నిర్మించాలని భావిస్తోంది. రెండు దేశాల మధ్య తీస్తా నీటి భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.

Read Also: Crime News: తాగొచ్చిన భర్తను పొడిచి చంపిన భార్య.. సలసల కాగే నూనె పోసేసింది..

అయితే, ఈ చర్య ఫరక్కా బ్యారేజ్ కారణంగా నేల కోతకు గురవ్వడంతో పాటు వరదలకు కారణమని ఈ ఒప్పందాన్ని చాలా కాలంగా మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. గతంలో 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటనలో నీటి భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది, కానీ ఇది బెంగాల్‌లోని ఉత్తర ప్రాతంలో నీటి కొరతకు దారి తీస్తుందని మమతా బెనర్జీ అభ్యంతరం చెప్పడంతో ఈ ఒప్పందాన్ని నిలిపేశారు.

గంగా నది జలాలను పంచుకోవడంపై బంగ్లాదేశ్ మరియు భారతదేశం మధ్య జరిగిన ఫరక్కా ఒప్పందం 2026లో ముగుస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, బంగ్లాదేశ్ సరిహద్దుకు 10 కి.మీ దూరంలో ఉన్న భాగీరథి నదిపై ఫరక్కా డ్యామ్ వద్ద నీటిని పంచుకోవడానికి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఎగువ నదిని ఇండియా, దిగువ నదిని బంగ్లాదేశ్ పంచుకుంటున్నాయి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి, టీఎంసీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది.