NTV Telugu Site icon

Trinamool Congress: టీఎంసీ ఎంపీ రాజీనామా.. మమతా బెనర్జీ తీరుని సహించలేకే..

Jawhar Sircar

Jawhar Sircar

Trinamool Congress: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆదివారం తన పార్లమెంటరీ పదవికి రాజీనామా చేశారు. కొల్‌కతా ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాసీని లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. సొంత పార్టీలో కొంతమంది అవినీతిపరులు నియంత్రణ లేని మితిమీరిన వైఖరిని అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కరువైందని పేర్కొన్నారు.

‘‘ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో జరిగిన భయంకరమైన సంఘటన నుండి నేను ఒక నెల పాటు ఓపికగా బాధపడ్డాను మరియు మమతా బెనర్జీ తన పాత శైలిలో ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో మీ ప్రత్యక్ష జోక్యం కోసం ఆశించాను. అది జరగలేదు మరియు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న శిక్షాత్మక చర్యలు చాలా తక్కువ మరియు చాలా ఆలస్యంగా ఉన్నాయి,’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. సరైన పరిపాలనపరమైన చర్యలు తీసుకుని దోషుల్ని ప్రభుత్వం శిక్షించి ఉంటే రాష్ట్రంలో ముందుగానే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు.

READ ALSO: America : గే అన్నందుకు 14ఏళ్ల బాలుడు కాల్పులు.. నలుగురు మృతి

తన రాజీనామా తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి వైదొగుతానని చెప్పారు. తన రాజీనామాని ఢిల్లీకి వెళ్లి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కి సమర్పిస్తానని చెప్పారు. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం మరియు హత్యకు గురైంది. ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం కొట్టచ్చినట్లు కనిపించిదని కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుని సీబీఐకి అప్పగించింది.

ఇదిలా ఉంటే, మొదటి నుంచి ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ వ్యవహార శైలి అనుమానాస్పదంగానే ఉంది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. దీంతో పాటు ఘటన స్థలంలో ఘటన జరిగిన తర్వాత రోజే పునరుద్ధరణ పనులకు ఆదేశాలు ఇచ్చాడు. బాధిత యువతి మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రుల్ని 3 గంటల పాటు అనుమతించలేదు. మరోవైపు టీఎంసీ నాయకులు ఆందోళన చేస్తున్న డాక్టర్లను, సాధారణ ప్రజల్ని భయపెట్టేలా హెచ్చరికలు జారీ చేస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది.

మరోవైపు సిర్కార్ వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఆందోళనకారులు పరిపాలనని తప్పుగా అర్థం చేసుకున్నారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు. ప్రస్తుతం మేం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో సైనికుల వలే పని చేస్తున్నామని చెప్పారు. సిర్కార్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే, ఈ వ్యవహారంలో బీజేపీ స్పందించింది. ఈ రాష్ట్రంలో ఎవరైనా రాజీనామా చేయాల్సి వస్తే అది మమతా బెనర్జీ అయి ఉండాలి అని అన్నారు. టీఎంసీ ప్రభుత్వం అవినీతిని సంస్థాగతం చేసిందని ఆరోపించింది.

Show comments