Odisha: ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్(బీజేడీ)కి చెందిన మాజీ గిరిజన ఎంపీ, గిరిజనేతర మహిళను పెళ్లి చేసుకోవడం వివాదంగా మారింది. మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ, సుశ్రీ సంగీత సాహూ అనే బ్రహ్మణ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన ఒక రోజు తర్వాత ఆయన కుటుంబాన్ని తెగ నుంచి బహిష్కరించారు. గోవాలో వివాహం జరిగిన ఒక రోజు తర్వాత ‘‘భటర సమాజ్ కేంద్ర కమిటీ’’ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Bihar: ‘‘డ్యాన్స్ చేస్తావా లేదా సస్పెండ్ చేస్తా’’.. పోలీసులపై లాలూ కుమారుడి జులుం..
గిరిజన నేత, గిరిజనేతర మహిళను వివాహం చేసుకోవడంపై కోపంతో, ధమ్నాగూడలో కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో, గిరిజనేతర అగ్రకుల మహిళను పెళ్లి చేసుకోవడాన్ని నేరంగా పరిగణించిన తెగ పెద్దలు.. ప్రదీప్ మాఝీని, ఆయన కుటుంబాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. ప్రదీప్ మాఝీ తన తెగలో అమ్మాయిని కాకుండా, వేరే కుల అమ్మాయిని పెళ్లి చేసుకుని తెగ నిబంధనల్ని ఉల్లంఘించారని కమిటీ నిర్ణయించింది. ఈ తీర్పు ప్రకారం, మాఝీతో పాటు ఆయన కుటుంబం 12 ఏళ్ల పాటు భటర సమాజంలో పాల్గొనలేదు.
మాఝి తనను తాను ఆదివాసీ సమాజం కంటే ఉన్నతంగా భావిస్తున్నాడని, బ్రాహ్మణ మహిళతో సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా భటర సమాజానికి అగౌరవం తెచ్చాడని గిరిజన నాయకులు ఆరోపించారు. గురువారం గోవాలో ఒక ప్రైవేట్ వేడుకలో ప్రదీప్ మాఝీ సంగీత సాహూని వివాహం చేసుకున్నారు. ప్రదీప్ మాఝీ 2009లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై నబరంగ్‌పూర్ సీటు నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ని వీడిన ఈయన 2021లో బీజేడీలో చేరారు. 2024 ఎన్నికల్లో బీజేడీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సంగీత భువనేశ్వర్ ఉత్కళ్ యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్ చదివారు. ఆమె కొన్ని వార్తా పత్రికలు, ఛానెళ్లకు పనిచేసింది.