NTV Telugu Site icon

Heavy Rains: వణకుతున్న ఉత్తరాది.. కుంభవృష్టితో అతలాకుతలం.. 60 మందికి పైగా మృతి

Heavy Rains

Heavy Rains

Heavy Rains: దేశ వ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాలు కుంభవృష్టితో అల్లకల్లోలం అవుతున్నాయి. ఎన్నడూలేనంతగా భారీ వర్షాలతో ప్రజలు అల్లలాడుతున్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీ రాష్ర్టాల్లో గత మూడు రోజులుగా వానలు దంచి కొడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు, నివాస ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల పలు ఇండ్లు, భవనాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. సాధారణ జనజీవనం అతలాకుతలమైంది. వేలాది మంది ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. భారీ వర్షాలతో ఆయా రాష్ర్టాల్లోని నదుల్లోకి వరద నీరు పోటెత్తుతున్నది. వరద నీటిలో లారీలు, కార్లు వంటి వాహనాలతో పాటు రోడ్లు కూడా కొట్టుకుపొయిన ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకొన్నాయి.

Read also: Uttar Pradesh: ఆటోను ఢీకొట్టి బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్..9 మంది మృతి..

ఉత్తరాది రాష్ర్టాల్లో గత మూడు రోజుల వ్యవధిలో 60 మందికి పైగా మరణించినట్టు తెలుస్తున్నది. యూపీలో 24 గంటల వ్యవధిలో పిడుగుపాటు, వరదల్లో కొట్టుకుపోవడం, ఇతర ఘటనల కారణంగా 34 మంది మరణించారని అధికారులు తెలిపారు. వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో సోమవారం కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. హిమాచల్‌ వరదల్లో పలు చోట్ల 200 మందికి పైగా చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. హర్యానాలోని అంబాలా-యమునానగర్‌ రహదారిపై వరద నీటిలో ఓ బస్సు చిక్కుకొని బోల్తాపడింది. దీంతో బస్సు టాప్‌పైకి ఎక్కిన 27 మంది ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది.. క్రేన్‌, తాడుల సాయంతో కాపాడారు. గత 50 ఏళ్లల్లో రాష్ట్రంలో ఇంతటి వర్షాలను చూడలేదని హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సుఖు పేర్కొన్నారు. ఒక్క హిమాచల్‌లోనే 17 మంది చనిపోయారని తెలిపారు. రూ.4 వేల కోట్ల మేర ఆస్తి నష్టం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. హిమాచల్‌లో వెయ్యికి పైగా రహదారులను మూసివేశారు. పలు జిల్లాల్లో సాధారణం కంటే అనేక రెట్లు అధికంగా వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. లాహౌల్‌ అండ్‌ స్పితి జిల్లాలో 37 రెట్లు అధికంగా వర్షం పడిందని ఐఎండీ తెలిపింది. సోమవారం ఉదయానికి రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా మౌంట్‌ అబులో 231 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ర్టాలకు పీఎంకేర్స్‌ నుంచి రిలీఫ్‌ ఫండ్‌ విడుదల చేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

Read also: Andrapradesh : ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు మృతి..

భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాది రాష్ర్టాల్లోని పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. హర్యానా నుంచి వరద నీరు పోటెత్తడంతో ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. యమునా నది డేంజర్‌ మార్క్‌ 205.33 మీటర్లు కాగా, సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి నదిలోని నీటిమట్టం 205.40కి చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యమున నదిలో నీటి మట్టం 206 మీటర్లు దాటితే, సమీప లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. వర్షాల ప్రభావంతో పలు రాష్ర్టాల్లో బడులకు సెలవులు ప్రకటించారు. హిమాచల్‌లో ఈనెల 11 వరకు, పంజాబ్‌లో 13 వరకు పాఠశాలకు మూసివేస్తున్నట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో మంగళ, బుధవారాలు బడులు ఉండవని అధికారులు తెలిపారు.

Read also: Jaipur: పెరుగుతున్న టమాటా చోరీలు.. తలలు పట్టుకుంటున్న అధికారులు

వర్ష విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా రాష్ర్టాల్లో 39 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్టు అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా రాష్ర్టాల యంత్రాల సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మధ్యధరా రీజియన్‌లో ఏర్పడే తుఫానులు(వెస్టర్న్‌ డిస్టర్బెన్స్‌), నైరుతి రుతుపవనాలు పరస్పరం కలసిపోవడమే ఉత్తరాది రాష్ర్టాల్లో కుండపోత వర్షాలకు కారణమని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాలు లేని కాలంలో అంటే శీతాకాలంలో ఈ వెస్టర్న్‌ డిస్టర్బెన్స్‌ల ప్రభావం కనిపిస్తుంటుందని, అయితే ఇప్పుడు రుతుపవనాల సమయంలోనే వాటి ప్రభావం ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.