NTV Telugu Site icon

Puja khedhkar: ట్రైనీ ఐఏఎస్ పూజాకు బిగ్ షాక్.. శిక్షణ నిలిపివేస్తూ ఆదేశాలు

Puneiaspujakhedkar

Puneiaspujakhedkar

ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్ తగిలింది. శిక్షణ నిలిపివేస్తూ తాజాగా సాధారణ పరిపాలనా విభాగం నుంచి ఆమెకు ఆదేశాలు వెళ్లాయి.  ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు పిలిపించింది. దీంతో పూజాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇటీవలే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆమెను పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. కానీ తవ్వేకొద్దీ… రోజుకో కొత్త ఆరోపణలు రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై యాక్షన్‌కు పూనుకున్నాయి.

పూణెకు ట్రైనీ ఐఏఎస్ అధికారిగా వెళ్లే ముందు పూజా.. అధికారుల్ని బెదిరించి కలెక్టరేట్‌లో ఏర్పాట్లు చేసేలా బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఈ వ్యవహారాన్ని పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించింది. కానీ ఆమెపై మాత్రం ఆరోపణలు ఆగలేదు. రోజుకో ఆరోపణ రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ యవ్వారం ఇలా ఉంటే ఆమె తల్లి మనోరమా.. ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. ఇక పూజా చదువు, మెడికల్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి పెట్టినట్లుగా ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది.

ఇక సోమవారం అర్ధరాత్రి ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటికి పోలీసులు వచ్చారు. సివిల్ డ్రస్‌లో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వారు ఆమెతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళా పోలీసుల బృందం పూణెలోని పూజా ఖేద్కర్‌ నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటల తర్వాత అంటే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మహిళా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులతో పూజా ఏం మాట్లాడారన్నది ఇంకా తెలియలేదు.

ఇదిలా ఉంటే పూజా అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. యూపీఎస్సీలో ఆమె నకిలీ సర్టిపికెట్లు సమర్పించడం.. అలాగే విద్యకు సంబంధించిన పత్రాలు కూడా నకిలీ సమర్పించినట్లుగా కీలక అంశాలు బయటకు వచ్చాయి.

తాజాగా ఇప్పుడు మరో విషయం బయటికొచ్చింది. సివిల్స్‌ పరీక్షకు ఆమె వేర్వేరు పేర్లతో హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో ఖేద్కర్‌ పూజా దిలీప్‌రావు అనే పేరుతో ప్రిలిమ్స్‌ రాయగా.. 2022లో పూజా మనోరమా దిలీప్‌ ఖేద్కర్‌ పేరుతో పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. రెండోసారి రాసిన పరీక్షలోనే ఆమె ఐఏఎస్‌కు ఎంపికైంది. అటు సెంట్రల్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌కు చేసుకున్న దరఖాస్తుల్లోనూ తన వయసును వేర్వేరుగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు కాలేజీ యాజమాన్యం తేల్చింది. ఇప్పటికే పూజా ఖేద్కర్‌ వివాదంపై దర్యాప్తునకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు వారాల్లో కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.