Site icon NTV Telugu

Top Headlines @ 9 pm: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

గాప్పమనసు చాటుకున్న సీఎం జగన్..

మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. నిరుపేద బిడ్డ … లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని.. మీరు నిశ్చితంగా ఉండాలంటూ తన దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.. ఈ ఘటన శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకరరెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది . చాలామంది వైద్యుల వద్దకు తిరిగారు. వైద్యుల సూచనలతో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని , పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు. పేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని పరిస్థితి.. దీంతో, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. దివాకర రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని, మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు.

కాబోయే సీఎం కేటీఆర్..!

కూకట్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు స్వాగతం అంటూ కొందరు నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. కొన్ని నెలల క్రితం ఈ తరహాలోనే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత ఇందుకు ముగింపు పడింది. తిరిగి మళ్లీ ఇప్పుడు కేటీఆర్‌ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు నగరంలో సాలు దొర.. సెలవు దొర అంటూ బీజేపీ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అయితే, కేటీఆర్ మాత్రం కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయనే సీఎంగా ఉంటారని చెబుతున్నారు. అయితే, టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్ త్వరలోనే సీఎం అవుతారని భావిస్తున్నాయి.

మా మధ్య ఉన్నది తోడి కోడళ్ల పంచాయతీ..

రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఇద్దరు నేతలు తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య కొంతకాలంగా ఎడం పెరిగిన సంగతి తెలిసిందే. తమది తోడికోడళ్ల పంచాయితీ అని… పొద్దున తిట్టుకుంటాం మళ్లీ కలిసిపోతామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు మద్దతిస్తున్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇంకా పదేళ్లు అయ్యాకా… రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అన్నారు. ఇప్పట్లో రేవంత్‌ని పదవి నుంచి దింపడం సాధ్యం కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రముఖ ఒడియా నటి ఝరానా దాస్ మృతి

చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ ఒడియా నటి ఝరానా దాస్ మృతి చెందారు. 77 ఏళ్ళ ఝరానా గత కొన్నిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది. నేటి ఉదయం ఒడిశాలోని కటక్ లో తన స్వగృహంలో ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఒడియా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఇక ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ” లెజెండరీ నటి ఝరానా దాస్ మృతి నన్ను కలిచివేసింది. ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె సినిమాలలో ఎప్పుడు జీవించే ఉంటారు” అని తెలిపారు. 1960 లో యాక్టింగ్ మొదలుపెట్టిన ఝరానా నారి అడిన మేఘ, పుజపుల్ల, హీరా నెళ్ల లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ముక్కలు చేశా..

శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలా నార్కో టెస్ట్ ముగిసింది. రెండు గంటలపాటు జరిగిన నార్కో టెస్టులో తన ప్రియురాలిపై జరిగిన పాశవిక హత్యను వివరించాడు. ఫోరెన్సిక్ అధికారులు దీనిని ధృవీకరించనప్పటికీ, అఫ్తాబ్ హత్య, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా రోహిణిలోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో గురువారం నార్కో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నార్కో పరీక్ష దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు, నిపుణుల సమక్షంలో జరిగిన పరీక్షలో అఫ్తాబ్‌ను పలు ప్రశ్నలు, సమాధానాలు అడిగారు. అతడిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు, ఇందులో భాగంగా శ్రద్ధ హత్య, మృతదేహం ఆచూకీతో సహా పలు రహస్యాలను వెల్లడించే ప్రయత్నం చేశామని అధికారులు ప్రకటించారు. గాఢనిద్రలో ఉన్న అఫ్తాబ్‌ని పదే పదే చప్పుడుతో నిద్రలేపి ప్రశ్నలకు సమాధానం రాబట్టామన్నారు. మధ్యాహ్నం 12.00 గంటల ప్రాంతంలో నార్కో పరీక్ష పూర్తయింది. అనంతరం గంటపాటు అబ్జర్వేషన్‌ రూంలో ఉంచామన్నారు. ఆ తర్వాత మళ్లీ వైద్యం చేయించాక… అర్ధరాత్రి 1.00 గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరిగి తీహార్ జైలుకు తరలించారు.

లోకల్‌ టాలెంట్‌కు ఆనంద్‌ మహీంద్రా ఫిదా..

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. మరో కొత్త టాలెంట్‌ను సోషల్‌ మీడియాలో నెటిజన్లకు పరిచయం చేశారు.. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లపై ఫోకస్‌ పెరిగడం.. అవి కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతోన్న నేపథ్యంలో.. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా.. గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.. ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం అంటూ రాసుకొచ్చారు.. కేవలం చిన్న డిజైన్ ఇన్‌పుట్‌లతో తయారు చేసిన ఈ వాహనం.. గ్లోబల్ అప్లికేషన్‌ను కనుగొనగలదు. రద్దీగా ఉండే యూరోపియన్ పర్యాటక కేంద్రాల్లో టూర్ ‘బస్సు’లా? నేను ఎల్లప్పుడూ గ్రామీణ రవాణా ఆవిష్కరణలతో ఆకట్టుకుంటాను.. ఇక్కడ అవసరం ఆవిష్కరణకు తల్లి.. అని పేర్కొన్నారు.. ఇక, ఆ వీడియోలో ఆ వాహనం తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యింది.. ఎన్ని కిలోమీటర్ల వరకు నడుస్తుందనే విషయాలను పంచుకున్నాడు ఆ బైక్‌ తయారు చేసిన యువకుడు.. ఆ వాహనాన్ని తయారుచేసేందుకు రూ.12,000 ఖర్చు అయ్యిందని.. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 150 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని.. సదరు యువకుడు చెప్పుకొచ్చాడు.. అయితే, పొడవాటి సైకిల్‌లా ఉన్న ఆ వాహనం.. పెద్దసైజ్‌ బైక్‌లా కనిపిస్తోంది.. ఒకరి తర్వాత ఒకరు కూర్చేనే విధంగా సీట్లను ఏర్పాటు చేశారు.. మొత్తంగా ఆ వాహనానికి ఆనంద్‌ మహీంద్ర మాత్రమే కాదు.. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు..

జీవిత బీమా సం స్థ (ఎల్ఐసీ) తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.. తమ పాలసీకి సంబంధించిన వివరాలు కావాలంటే.. ఇప్పటి వరకు ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది.. కానీ, ఇకపై అన్ని వాట్సాప్‌లోనే తెలుసుకునే వెసులుబాటు తీసుకొంది.. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై పూర్తి సమాచారం అందించే విధంగా.. వాట్సా ప్ సర్వీస్‌ను ప్రారంభించింది ఎల్ఐసీ.. అంటే, ఇకపై ప్రతీ చిన్న పనికి కార్యాలయానికి పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు.. ఇంతకీ వాట్సాప్‌ సేవలను తీసుకొచ్చిన ఎల్‌ఐసీ.. ఏ నంబర్‌ కేటాయించింది.. ఎలాంటి సేవలు పొందవచ్చు.. ఎలా పొందాలి అనే వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఐసీ పోర్టల్‌లో తమ పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారులు మొబైల్ నంబర్ 8976862090కి ‘HI’ అని చెప్పడం ద్వారా వాట్సాప్‌లో ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు..

Exit mobile version