NTV Telugu Site icon

Bangladesh: బంగ్లా టాప్ ఆర్మీ జనరల్, పాక్ ఆర్మీ చీఫ్‌తో భేటీ.. ఇండియానే లక్ష్యమా..?

Bangladesh

Bangladesh

Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా ఎప్పుడైతే పదవీ కొల్పోయిందో అప్పటి నుంచి నెమ్మదిగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ పాకిస్తాన్‌తో బంగ్లా రిలేషన్స్‌ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్‌ని కలిశారు. మరోవైపు బంగ్లాదేశ్ రానురాను పాకిస్తాన్ తరహాలోనే ఇస్లామిక్ దేశంగా మారుతోంది. అక్కడ మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్‌కి సైన్యానికి చెందిన టాప్ జనరల్, ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్, సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎమ్ కమర్-ఉల్-హసన్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో భేటీ అయ్యారు. ఇలా బంగ్లాదేశ్‌ సైన్యానికి చెందిన ఒక కీలక వ్యక్తి, పాకిస్తాన్ సైన్యంలో భేటీ కవాడం ఇదే తొలిసారి. ఇరు దేశాలు తమ రక్షణ సంబంధాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Read Also: Giorgia Meloni: జార్జియా మెలోని కోసం మోకరిల్లిన అల్బేనియా ప్రధాని.. ఎందుకో తెలుసా..?

ఈ సమావేశంలో పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాతో చర్చలు కూడా జరిగాయి. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం.. ఇరువురు సైన్యాధికారులు దక్షిణాసియాలో భద్రతపై విస్తృతంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాల పెంపుపై మాట్లాడారు. రెండు దేశాలు తమ రక్షణ సంబంధాలను బలోపేతం చేయాలని చర్చలు జరిపారు. ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు శాశ్వత భాగస్వామ్యం అవసరమని ఇరువురు జనరల్స్ నొక్కి చెప్పారు.

మరోవైపు ఫిబ్రవరి 2025 నుంచి బంగ్లాదేశ్ ఆర్మీకి, పాకిస్తాన్ సైనిక శిక్షణ ప్రారంభించబోతోంది. ఈ పరిణామాలు ఇండియాకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇండియా వ్యతిరేకత గూడుకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇస్లామిక్ మతోన్మాద సంస్థలైన జామతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)లు భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నాయి. సరిహద్దుల్లో భారత బలగాలను ప్రతిఘటించే చర్యలకు పాల్పడుతున్నారు. ఆ దేశానికి చెందిన మాజీ ఆర్మీ జనరల్స్, ఇతర అధికారులు భారత్‌ని స్వాధీనం చేసుకుంటామని లేని పోని ప్రగల్భాలను పలుకుతున్నారు. అయితే, ఈ పరిస్థితులన్నింటిని భారత్ నిషిత దృష్టితో గమనిస్తోంది.