NTV Telugu Site icon

JK Polls: రేపు జమ్మూకాశ్మీర్‌లో రెండో విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

Jkpolls

Jkpolls

జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పా్ట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత సెప్టెంబర్ 18న ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత సెప్టెంబర్ 25న జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తి చేశారు. బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని ఆరు జిల్లాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. రాజౌరీ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలు: కంగన్ (ST), గందర్‌బల్, హజ్రత్‌బాల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్ చౌక్, చన్నపోరా, జదిబాల్, ఈద్గా, సెంట్రల్ షాల్టెంగ్, బుద్గామ్, బీర్వా, ఖాన్‌సాహిబ్, చ్రార్-ఐ-షరీఫ్, చదూరా మరియు గులాబ్‌ఘర్ ( ST). రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కలకోటే-సుందర్‌బని, నౌషేరా, రాజౌరి (ST), బుధాల్ (ST), తన్నమండి (ST), సురంకోట్ (ST), పూంచ్ హవేలీ, మెంధార్ (ST)ల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి మరియు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాతో సహా 239 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఒమర్.. బుద్గామ్ మరియు గందర్‌బల్ రెండింటి నుంచి పోటీ చేస్తున్నారు. నౌషేరా స్థానం నుంచి జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా పోటీ చేస్తున్నారు. సెంట్రల్ షాల్టెంగ్ నుంచి జమ్మూకాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా ఇతర ప్రముఖ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సెప్టెంబర్ 18న జరిగిన తొలి దశలో భారీగా పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 61.13 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడత సెప్టెంబర్ 25, మూడో విడత అక్టోబర్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి.