Congress: ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివాదస్పద వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం నాడు పార్లమెంట్‌లో జరిగిన తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే ఈ ఘటన జరిగిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీంతో రాహుల్ పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈరోజు (డిసెంబర్ 20) దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. బీఆర్ అంబేడ్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ చివరి రోజైన ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also: Camera Found in MRI Centre: ఎంఆర్‌ఐ సెంటర్ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా
అయితే, రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్, హేమంగ్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు సెక్షన్ 117, 115, 125, 131, 351తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, పార్లమెంట్ హౌస్‌లోని ఏ గేటు వద్ద కూడా ఏ పార్టీకి చెందిన ఎంపీలు నిరసనకు దిగకూడదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవద్దని, నిరసన వ్యక్తం చేయవద్దని స్పీకర్ ఓం బిర్లా ఎంపీలందరికీ హెచ్చరించారు.