ఇక్కడ చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకురాలేక.. దుబాయ్, కువైట్ వంటి ప్రాంతాలకు పెదవాళ్ళు వెళుతుంటారు. అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో, కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఒంటరి పోరాటానికి బయలుదేరుతారు. దీన్నే అలుసుగా తీసుకొని, కొందరు ఏజెంట్లు నేలపై ఆకాశం చూపించేందుకు ప్రయత్నిస్తారు. అక్కడికెళ్ళాక ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా తాము చూసుకుంటామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తారు. పాపం.. వారి మాటలకు లొంగి, తమ జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక, ఏజెంట్లు తమ అసలు రూపాన్ని బయటపెడతారు. అలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా ఎర్రివారిపాలెం మండలం పెద్దవడ్డిపల్లికి చెందిన శ్రావణి అనే మహిళ.. ఉపాధి కోసం గత నెలలో కువైట్‌కి వెళ్ళింది. అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తాను జాగ్రత్తగా చూసుకుంటానని ఏజెంట్ చెంగల్‌రాజా ఆమె కుటుంబసభ్యుల్ని నమ్మించాడు. కువైట్‌లో ఉద్యోగం చేస్తే, తక్కువ సమయంలోనే భారీ డబ్బులు సంపాదించొచ్చని ఆశ చూపాడు. అతడు చెప్పిన మాటలు నమ్మి, ఆమె కువైట్‌కి వెళ్ళింది. ఒక నెల రోజుల వరకు అన్ని సవ్యంగానే సాగాయి. అయితే, ప్రస్తుత యజమాని తనని సరిగా చూసుకోవడం లేదని, మరో చోట పని ఇప్పించాలని ఆమె కోరింది. అందుకు సరేనన్న ఆ ఏజెంట్.. మరో చోట పని దొరికేలోపు తన ఆఫీసులోనే ఉండమని చెప్పాడు. అంతే, ఆమెని ఓ గదిలో బంధించి, వేధించడం మొదలుపెట్టాడు. మానసికంగానే కాదు.. లైంగికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. సమయానికి ఆహారం కూడా ఇవ్వడం లేదు.
దీంతో.. శ్రావణి సెల్ఫీ వీడియోలో తన వ్యధ చెప్పుకుంది. తనని వెంటనే భారత్‌కు రప్పించండని ఆ వీడియోలో కోరింది. ఏజెంట్ చెంగల్‌రాజా తనని పెడుతున్న చిత్రహింసల గురించి ఆ వీడియోలో వివరించింది. ఏజెంట్‌తో పాటు అతని పార్ట్నర్ కూడా తనని వేధిస్తున్నాడని భోరుమంది. నాలుగు రోజుల నుంచి సరిగ్గా ఆహారం తినలేదని, కేవలం నీళ్ళతోనే సాగిస్తున్నానని ఆమె విలపించింది. ఎలాగైనా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వేడుకుంది. ఇక్కడున్న శ్రావణి అత్త సైతం, ఏజెంట్ బాగా చూసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తన కోడల్ని రప్పించాలని కోరింది.