Site icon NTV Telugu

INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. చర్చలతో విసిగిపోయామన్న ఆప్..

India Bloc

India Bloc

INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. బెంగాల్‌లో పొత్తు ఉండదని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించింది.

Read Also: Tammineni Seetaram: ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. భావోద్వేగానికి లోనైన స్పీకర్

ఇదిలా ఉంటే, మరోసారి ఇండియా కూటమిపై ఆప్ తన అసంతృప్తి వెల్లగక్కింది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకం ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించింది. చర్చలతో విసిగిపోయామని అస్సాం రాష్ట్రంలో 3 స్థానాలకు అభ్యర్థులను గురువారం ప్రకటించింది. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆప్ ఎంపీ సందీప్ పాఠక్.. ఇండియా కూటమితో నెలల తరబడి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని అన్నారు. మనోజ్ ధనోహర్ దిబ్రూగఢ్ నుంచి, భవెన్ చౌదరి గౌహతి నుంచి, రిషి రాజ్ సోనిత్‌పూర్ నుంచి పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది.

కూటమిలో సీట్ల పంపకం ప్రక్రియను వేగవంతం చేయాలని కూటమి భాగస్వాములను ఆప్ కోరింది. మేము ఇండియా కూటమికి అండగా ఉన్నామని చెప్పింది. తమ అభ్యర్థులు ప్రజలకు చేరువయ్యేందుకు ముందుగానే పేర్లను ప్రకటించినట్లు ఆప్ వెల్లడించింది. దీనికి ముందు కాంగ్రెస్‌ని సంప్రదించకుండా ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ(ఎస్పీ)పార్టీ ఏకపక్షంగా 16 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ ఈ విషయాన్ని తప్పుబట్టింది.

Exit mobile version