Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో దుండగుల దాడిలో ముగ్గురు మృతి… కొనసాగుతున్న హింస

Manipur

Manipur

Manipur: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ హింసను ఆపలేకపోతున్నారు. ఆదివారం అర్థరాత్రి మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్‌ జిల్లాలోని ఖొయిజుమన్‌తాబి అనే గ్రామంపై సాయుధులైన దుండగులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న బంకర్లపై దుండగులు దాడి చేశారు. దుండగుల దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు మరణించారు. మే 3న ప్రారంభమైన హింస ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మణిపూర్‌లో శాంతియుత వాతావరణం కోసం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా 4 రోజులపాటు అక్కడే ఉండి పలువురితో సమావేశాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ సైతం సమావేశాలను నిర్వహించినప్పటికీ ఫలితం లేదు. ఇప్పటికీ మణిపూర్‌లో రావణకాష్టంలాగా హింస జరుగుతూనే ఉంది.

Read also: Payal Rajput: ఆ హీరోతో ఒక్కసారైనా ఆ పని చెయ్యాలి?

ఆదివారం అర్ధరాత్రి ఖొయిజుమన్‌తాబి సమీపంలోని కొండలపై నుంచి వచ్చిన దుండగులు దాడి చేశారని.. ఈ దాడిలో ముగ్గురు గ్రామ వాలంటీర్లు (Village volunteers) మరణించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఘటనా స్థలానికి చేరుకునే సరికి దుండగులు అక్కడినుంచి పారిపోయారని, ఆ సమయంలో కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయని వెల్లడించారు. శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం మూసివేసిన 2వ నంబర్‌ జాతీయ రహదారిని కుకీ తెగలు తిరిగి తెరిచాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి మేరకు కంగ్‌పోక్పీ జిల్లాలోని జాతీయ రహదారి దిగ్భంధాన్ని విరమించుకున్నట్లు కూకీ తెగలకు చెందిన యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (UPF), కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ (KNO) వెల్లడించాయి. మణిపూర్‌లో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇంఫాల్‌ నుంచి దిమాపూర్‌ వరకు ఎన్‌హెచ్‌-2, ఇంఫాల్‌ నుంచి జిరిబామ్‌ వరకు ఎన్‌హెచ్‌ 37 ఉన్నాయి. రాష్ట్రంలో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు హైవేలను కుకీ తెగ నిరసనకారులు మూసివేశారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసపై త్వరలో ప్రారంభం కాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై పార్లమెంటులో లేవనెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version