NTV Telugu Site icon

Modi US Visit: వచ్చే నెల అమెరికాకు మోడీ.. యూఎస్ ఎన్నికల ముందు కీలక పర్యటన..

Pm Modi

Pm Modi

Modi US Visit: ఐక్యరాజ్యసమితి వార్షిక సదస్సు కోసం వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలో జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత, అక్కడే ప్రవాస భారతీయులు నిర్వహించే భారీ సమావేశానికి మోడీ హాజరు కానున్నారు. అయితే, యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆ దేశ నాయకులు ఎవరూ పాల్గొనరని సమాచారం. అయితే, అమెరికా ఎన్నికల ముందు ప్రధాని ఆ దేశానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 18000 మంది హాజరయ్యే అవకాశం ఉన్న లాంగ్ ఐలాండ్‌లోని ఓపెన్ ఎయిర్ వేదికలో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించబడుతుందని ఆయా వర్గాలు తెలిపాయి.

Read Also: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..

‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’తో ప్రారంభమయ్యే సెప్టెంబర్ 22 నుండి 28 వరకు ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి సమావేశాల కోసం మోడీ న్యూయార్క్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 26న జరిగే జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తారు. అయితే, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నందున, అక్కడి దేశీయ రాజకీయాలపై ప్రభావం ఉండకూడదని, అమెరికా రాజకీయ నాయకులు ఈ సమావేశాలకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

2019లో అప్పటి అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ప్రధాని మోడీ-డొనాల్డ్ ట్రంప్ హ్యూస్టన్‌లో జరిగిన భారీ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో మోడీ ‘‘అబ్కీ బార్ ట్రంప్ సర్కార్’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పటి ఎన్నికల్లో సంచలనంగా మారాయి. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ గెలిచారు. మోడీ సమావేశంలో పాల్గొనే యూఎస్ నాయకులు తటస్థంగా ఉండాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు. హ్యూస్టన్ సమావేశానికి ముందు సెప్టెంబర్ 2014లో తన మొదటి ఎన్నిలక విజయం తర్వాత ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళ్లారు. ఆ తర్వాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో దాదాపు 20,000 మందితో నిండిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మరుసటి సంవత్సరం, అతను శాన్ జోస్‌లో డయాస్పోరాతో సామూహిక సమావేశాన్ని నిర్వహించాడు. గతేడాది ఐరాసలో జరిగిన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మాస్ ఎక్సర్‌సైజ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.