Akhilesh Yadav: మందిర్-మసీదు వివాదంలో సర్వేలను నిలిపేయాలని గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణ ముగిసే వరకు సర్వేలు నిలిపేయాలని కోరింది. ఈ ఆదేశాలు వచ్చిన ఒక రోజు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: Minister Gottipaati: నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ
శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో అఖిలేష్ యాదవ్.. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జామా మసీదు సర్వేని గురించి ప్రస్తావించారు. సర్వే సమయంలో ఓ గుంపు రాళ్లదాడికి పాల్పడటంతో హింస చెలరేగింది. దీంట్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. భారతీయ ఓటర్లను బీజేపీ ఎప్పుడూ గౌరవించదని, యూపీ ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయడానికి అనుమతించలేదని, పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.
రాజ్యాంగం దేశాన్ని సురక్షితంగా, ఐక్యంగా ఉంచిందని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ వంటిదని చెప్పారు. రాజ్యాంగంపై చర్చ నేపత్యంలో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భద్రత, ఆర్థిక వ్యవస్థ, పౌరుల అంతర్గత భద్రతపై సందేహాలు లేవనెత్తారు. చైనా ఆక్రమణని ప్రస్తావించారు. దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తు్న్నారని ఆరోపించారు. కుల గణన కులాలా మధ్య అంతరాన్ని తొలగిస్తుందని, అవకాశం దొరికితే కుల గణన నిర్వహిస్తామని చెప్పారు.