PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ప్రతిపక్ష పార్టీలు, నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. నవరాత్రి సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేపల్ని తిన్నాడన్న వివాదం నేపథ్యంలో శుక్రవారం మోడీ వారిపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, నిర్ధిష్ట ఓట్ బ్యాంక్ కోసం పాటుపడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. దేశంలోని మెజారిటీ జనాభా మనోభావాల గురించి వారికి పట్టింపు లేదని, తేజస్వీ యాదవ్ పోస్టు చేసిన వీడియో గురించి పరోక్షంగా ప్రస్తావించారు. నవరాత్రి ప్రారంభానికి ముందు తేజస్వీ యాదవ్ ఓ వీడియోను పోస్ట్ చేసి, ప్రజలు ఏం తింటున్నారు..? ఏం ధరిస్తున్నారు..? అనే విషయాల్లో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, ప్రజలకు కోసం ఏం చేయడం లేదని ఆరోపించారు.
ఈ రోజు జమ్మూకాశ్మీర్ ఉదంపూర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ విపక్ష నాయకులపై ఫైర్ అయ్యారు. గతేడాది సెప్టెంబర్ నెలలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మటన్ వండుకుని తిన్న వీడియో గురించి ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. దేశంలో చాలా మంది ప్రజల మనోభావాల గురించి పట్టించుకోకుండా, పవిత్ర శ్రావణ మాసంలో దోషిగా తేలిన వ్యక్తి ఇంటికి వెళ్లి మటన్ వండుకున్నారని, దేశ ప్రజల్ని ఆటపట్టిస్తున్నారంటూ రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై ఫైర్ అయ్యారు.
Read Also: Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్‌పై దాడి చేయబోతున్న ఇరాన్..
‘‘చట్టం ఎవరిని ఏమి తినకుండా ఆపలేదు, మోడీ కూడా అలా చేయడు, కానీ వారి ఉద్దేశం వేరుగా ఉంది. మొఘలులు దాడి చేసినప్పుడు, రాజును ఒంటరిగా చేసి ఓడించినందుకు వారు తృప్తి చెందలేదు. దేవాలయాలను ధ్వంసం చేసే వరకు వారికి సంతృప్తి లేదు. అదే విధంగా శ్రావణ మాసంలో వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా వారు(ప్రతిపక్షాలు) మొఘల్ కాలం నాటి ఆలోచనల్ని ప్రతిబింబిస్తున్నారు. ప్రజలను మనోభావాలను దెబ్బతీసేందుకు, వారి ఓటు బ్యాంకును బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ప్రధాని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఎవరిని సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు..? అని ప్రశ్నించారు.
ఈ విధంగా మాట్లాడినందుకు వారు తనపై దుష్ఫ్రచారం చేస్తారని తెలుసు, కానీ ప్రజలకు ఏది సరైనదో చెప్పడం ప్రజాస్వామ్యంలో నా కర్తవ్యమని, వారు ఉద్దేశపూర్వకంగా విశ్వాసాలపై దాడి చేస్తున్నారని, దీని వల్ల దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని, వారు బుజ్జగింపు రాజకీయాల్లో మించిపోయారని, మొగలుల ఆలోచనల్ని రుజువు చేస్తున్నారని ప్రధాని అన్నారు.