2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూఇయర్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. అయితే ఈ ఏడాది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఒడిదుడుకులు ఎదుర్కొని జైలు పాలయ్యారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దగ్గర నుంచి ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వరకు.. ఎలా ఎందరో ప్రముఖులు జైలు పాలయ్యారు. వాళ్లెవరో.. 2024లో జరిగిన సంఘటనలను ఒకసారి రివైండ్ చేసుకుందాం.
1. కేజ్రీవాల్
కేజ్రీవాల్ ఆప్ అధినేత. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బుక్కై అరెస్ట్ అయ్యారు. మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. మధ్యలో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కొన్ని రోజులు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఎన్నికల ప్రచారం చేసి.. తిరిగి జైల్లో లొంగిపోయారు. మొత్తానికి ఆరు నెలల తర్వాత బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. ఇక సెప్టెంబర్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ కుర్చీ అతిషికి అప్పగించారు. తిరిగి ఎన్నికల్లో గెలిచేంత వరకు ముఖ్యమంత్రి సీటులో కూర్చోనని శపథం చేశారు.
2. హేమంత్ సోరెన్
హేమంత్ సోరెన్.. జార్ఖండ్ ముఖ్యమంత్రి. మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకెళ్లారు. జైలుకెళ్లే ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానంలో చంపై సోరెన్‌ను కూర్చోబెట్టారు. తొలుత భార్య కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి చంపై సోరెన్ సీఎం అయ్యారు. తిరిగి బెయిల్‌పై విడుదలై.. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి సీటులో కూర్చు్న్నారు. ఇటీవల నవంబర్‌లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుని సీఎం సీటులో కూర్చున్నారు.
3. కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. విచారణ అనంతరం తీహార్ జైలుకు తరలించారు. కొన్ని నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో కవిత చురుగ్గా పాల్గొంటున్నారు.
4. అల్లు అర్జున్
అల్లు అర్జున్.. టాలీవుడ్ నటుడు. ఇటీవల విడుదలైన పుష్ప-2 చిత్రం చూసేందుకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తిరిగి బెయిల్‌పై కొన్ని గంటల వ్యవధిలోనే విడుదలై ఇంటికొచ్చారు.
5. దర్శన్
దర్శన్.. కన్నడ నటుడు. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై జైలు పాలయ్యారు. ప్రియురాలు పవిత్రా గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపించాడన్న కారణంతో రేణుకాస్వామిని దర్శన్, పవిత్రాగౌడ్, అనుచరులతో కలిసి హత్య చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
6. కస్తూరి
కస్తూరి.. ప్రముఖ సినీనటి. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆమె చెన్నైలో తెలుగువారిపై వివాదాదస్ప వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెను హైదరాబాద్‌లో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
7. హేమ
హేమ.. టాలీవుడ్ నటి. బెంగళూరు రేవ్ పార్టీలో పోలీసులకు దొరికిపోయారు. అనంతరం ఆమెను బెంగళూరు పోలీసులు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీలో హేమ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేశారు. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో హేమ విడుదలయ్యారు.