Site icon NTV Telugu

Haryana: ఎమ్మెల్యేపై దాడి చేసిన మహిళ.. ఊరు మునిగిపోనంక ఎందుకొచ్చావంటూ ప్రశ్నించిన మహిళ

Haryana

Haryana

Haryana: గత కొద్ది రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఉత్తరాది రాష్ట్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరడంతో ఇళ్లు ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రజాప్రతినిధులు పరామర్శించడం సర్వసాధారణం. వరదల సందర్భంగా బాధిత ప్రజలను పరామర్శించడానికి వెళ్లే ప్రజాప్రతినిధులకు వింత వింత ఘటనలు ఎదురవుతుంటాయి. అలాంటి ఘటననే హర్యానాలో ఒక ఎమ్మెల్యే ఎదుర్కోవాల్సి వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఓ మహిళ చెప్పుతో కొట్టింది. తమ ఊరంతా వరద నీటిలో మునిగిపోయింది.. ఇప్పుడెందుకు వచ్చావ్‌ అంటూ నిలదీసింది. దీంతో చేసేదేం లేక ఆ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Read also: Hathinikund Barrage: హథినికుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తితే ఢిల్లీ మునగడం ఖాయం.. ఎలానంటే ?

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హర్యానాలోని ఘగ్గర్‌ నది పొంగి పొర్లు తున్నది. దీంతో భారీ వరదలతో ఘులా ప్రాంతం పూర్తిగా నీటమునింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి స్థానిక జననాయక్‌ జనతా పార్టీ (JJP) ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌ వెళ్లారు. తమ ఇండ్లు నీట మునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలు.. తమను ఎవరు పట్టించుకోలేదనే కోపంతో ఉన్నారు. ఎమ్మెల్యే తమ ప్రాంతానికి రావడంతో అతడిని చుట్టముట్టారు. వారిలో ఓ మహిళ చెప్పుతో ఎమ్మెల్యే చెంపపై ఒక్కటేసింది. అంతా మునిగిపోయాక.. ఇక్కడేముందని చూడటానికి వచ్చావంటూ ప్రశ్నించింది. నదిపై కట్టిన చెక్‌డ్యాం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే ఎమ్మెల్యే సహాయకులు సర్ధిచెప్పడంతో ఆమె శాంతించింది. తాను ఆమె బాధను అర్థం చేసుకోగలనని ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్‌ చెప్పారు. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చెక్‌ డ్యాం వల్ల వరదలు రాలేదని.. భారీ వర్షాలే దానికి కారణమని ఆ మహిళతో చెప్పినట్లు వెల్లడించారు. జేజేపీ అధికార బీజేపీకి మిత్రపక్షం. ఎమ్మెల్యేను మహిళ చెప్పుతో కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Exit mobile version