Rahul On Independence Day: దేశంలోని ప్రతి ఒక్కరికి భరత మాత గొంతుక అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రలో తనను నిశ్శబ్ధశక్తి నడిపించిందని.. ఆ శక్తే భరతమాత అని అన్నారు. భరత మాత ప్రతి భారతీయుడి గొంతుక అని అన్నారు. దేశంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన భారత్ జోడో యాత్రలోని అనుభవాలను పంచుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 145 రోజులపాటు భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రయాణంలోని తన అనుభవాలను ఆయన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెట్‌లో పోస్టు పెట్టారు. ప్రజల ఆదరణతో అందిన నిశ్శబ్ద శక్తి తనకెంతో సహకరించిందన్నారు. ‘బలం, బలహీనతతో సంబంధం లేకుండా భరత మాత.. ప్రతి భారతీయుడి గళం. ఆ గళంలో ఆనందం, భయం, బాధ అంతర్గతంగా దాగి ఉంటుంది. భరత మాత గళం వినేప్పుడు నా సొంత గళం, నా సొంత ఆకాంక్షలను నిశ్శబ్దంగా ఉంచాను. వినయంగా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గళం వినిపిస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నా ప్రియమైన భరతమాత భూమి కాదు. అది ఆలోచనల సమాహారం కాదు. అది ఒక ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర, మతం కాదు. వ్యక్తులకు కేటాయించిన కులం కూడా కాదు. భారతదేశం ఎంత బలహీనంగా ఉన్నా, బలంగా ఉన్నా ప్రతి ఒక్క భారతీయుడి గొంతుక. అన్ని స్వరాల్లో దాగి ఉన్న ఆనందం, భయం, బాధ భరత మాత అని పేర్కొన్నారు.
Read also: MS Dhoni Retirement: ఎంత పని చేసావ్ ధోనీ భాయ్.. భారత క్రికెట్ ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోని రోజు!
ఇది ఎంత సింపుల్ గా సాగిందంటే.. సముద్రంలో మాత్రమే దొరికే దాని కోసం నదిలో వెతుకుతున్నాను. పర్షియన్ కవి రూమీ చెప్పిన మాటలను ఉదహరిస్తూ.. ‘హృదయం నుండి మాటలు వస్తే అవి హృదయంలోకి ప్రవేశిస్తాయి’’ అన్నారు. తన యాత్ర ప్రారంభించినపుడు కనిపించిన పాత గాయం, తన మోకాలి నొప్పి గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కానీ తన యాత్రలో ప్రజల సంఖ్య పెరగడంతో, వారి శక్తిని పొందడం వల్ల తన నొప్పి తగ్గిందని తెలిపారు. ‘‘అప్పుడు నేను ఒక విషయం గమనించడం మొదలుపెట్టాను. ఆపడం గురించి ఆలోచించిన ప్రతిసారీ, వదులుకోవాలని ఆలోచించిన ప్రతిసారీ, ఎవరైనా వచ్చి నాకు కొనసాగే శక్తిని బహుమతిగా ఇచ్చేవారని రాహుల్ చెప్పారు. ‘‘ఒక నిశ్శబ్ద శక్తి నాకు సహాయం చేస్తున్నట్లు అనిపించింది. చీకటి అడవిలోని నిప్పురవ్వల వలె, అది ప్రతిచోటా ఉంది. నాకు నిజంగా అవసరమైనప్పుడు అది సహాయం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి వచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఒక రోజు నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని నిశ్శబ్దాన్ని అనుభవించాను. నా చెయ్యి పట్టుకుని నాతో మాట్లాడుతున్న వ్యక్తి గొంతు తప్ప మరేమీ వినపడలేదు. చిన్నప్పటి నుంచి నాతో మాట్లాడిన అంతర్గత స్వరం పోయింది. ఏదో చచ్చిపోయినట్లు అనిపించింది’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.