పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఎంత హాట్‌హాట్‌గా సాగాయో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 1న ప్రారంభమైన దగ్గర నుంచి విపక్ష సభ్యులంతా సభలో గందరగోళం సృష్టిస్తూనే ఉన్నారు. చివరికి ఢిల్లీ కాలుష్యంపై చర్చ లేకుండానే సమావేశాలు ముగియడం ఆశ్చర్యం.
ఇదిలా ఉంటే సమావేశాల ముగింపు రోజున సంప్రదాయంగా ప్రధాని టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. గురువారం ‘జీ-రామ్-జీ’ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నానాయాగీ చేశారు. ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. కానీ అంతలోనే ప్రధాని మోడీ ఇచ్చిన టీ పార్టీకి హాజరై ఉల్లాసంగా గడిపారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మన్ పర్యటనలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ హాజరయ్యారు.
లోక్‌సభ స్పీకర్, ప్రధాని మోడీ ఒక సోఫాలో కూర్చోగా… రాజ్‌నాథ్‌సింగ్, ప్రియాంకాగాంధీ ఒక సోఫాలో కూర్చున్నారు. మిగతా అధికార-ప్రతిపక్ష సభ్యులంతా వేర్వేరు చోట్ల కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రియాంకాగాంధీ ఆసక్తికర స్టోరీ చెప్పారు. అలెర్జీలను తగ్గించుకునేందుకు తన నియోజకవర్గమైన వయనాడ్ నుంచి ఒక మూలికను తీసుకొచ్చి వాడుతుంటానని ప్రియాంకాగాంధీ పంచుకున్నారు. దీంతో ప్రధాని మోడీ, రాజ్‌నాథ్‌సింగ్ సహా ఎంపీలంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. మోడీ, రాజ్‌నాథ్‌సింగ్ నవ్వుతూ ఫొటోల్లో కనిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 3 దేశాల పర్యటన గురించి ప్రియాంకాగాంధీ ఆరా తీసినట్లు సమాచారం. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ పర్యటనలు బాగా జరిగినట్లుగా ప్రధాని బదులిచ్చినట్లు తెలుస్తోంది. 20 నిమిషాల పాటు జరిగిన సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ టీ పార్టీని బహిష్కరించగా.. అందుకు భిన్నంగా ప్రియాంకాగాంధీ హాజరై వార్తల్లో నిలిచారు.
