NTV Telugu Site icon

Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఏమైంది..?

Maharashtra Election Results

Maharashtra Election Results

Maharashtra Election Results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి( మహా వికాస్ అఘాడీ) కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ ఏకంగా 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ఈ ఎన్ని్కల్లో ముస్లిం అధిక్యత ఉన్న 38 సీట్లలో బీజేపీ కూటమి ఏకంగా 22 స్థానాలు గెలుచుకుంది. ప్రతిపక్ష కూటమి 13 సీట్లను కైవసం చేసుంది. ఈ 38 సీట్లలో ముస్లిం జనాభా 20 శాతానికి పైగా ఉంది.

ఓట్ల చీలిక కాంగ్రెస్‌ని తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఆ పార్టీకి గతంలో 11 సీట్లు ఉంటే, ప్రస్తుతం 05 సీట్లను గెలుచుకుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఆరు సీట్లు, శరద్ పవార్ ఎన్సీపీకి 2 సీట్లు వచ్చాయి. 2019లో బీజేపీకి 11 సీట్లు ఉంటే, ఇప్పుడు 14 సీట్లకు పెంచుకుంది. ఏక్‌నాథ్ షిండే శివసేన 06, అజిత్ పవార్ ఎన్సీపీ 02 సీట్లను గెలుచుకుంది. మిగిలిన మూడు సీట్లలో సమాజ్‌వాదీ(ఎస్పీ) రెండు, ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.

Read Also: Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత

ముస్లింలు ఈ సారి గంపగుత్తగా కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని మత నాయకులు పిలుపునిచ్చారు. అయినప్పటికీ, ఈ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి సత్తా చాటలేకపోయింది. ముస్లిం ఓట్ల ఏకీకరణకు వ్యతిరేకంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ పెరిగినట్లు, ఇది బీజేపీకి లాభించినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ సీనియర్ నేత విజయ్ సహస్రబుద్ధే మాట్లాడుతూ.. ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, అభివృద్ధికి ప్రజలు ఓటేశారని చెప్పారు. కాంగ్రెస్ బుజ్జగింపులు పనిచేయలేదని అన్నారు.

ఓడిపోయిన కీలకమైన ముస్లిం నేతల్లో ఎన్సీపీ నేతలు నవాబ్ మాలిక్, జీషన్ సిద్ధికీ, కాంగ్రెస్ నేత ఆరిఫ్ నసీమ్ ఖాన్, ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ఉన్నారు. ఇక ఎంఐఎం మాలేగావ్ సెంట్రల్‌లో మాత్రమే గెలిచింది. కేవలం 162 ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి ముఫ్తీ ఇస్మాయిల్ గెలిచారు. భివాండీ వెస్ట్‌లో ముస్లింల ఓట్లు ఎంఐఎం నేత వారిస్ పఠాన్, స్వతంత్ర అభ్యర్థి విలాస్ పాటిల్ మధ్య చీలిపోయాయి. ఫలితంగా బీజేపీ నేత రియాజ్ అజ్మీపై బీజేపీ అభ్యర్థి మహేష్ చౌగులే విజయం సాధించారు.