NTV Telugu Site icon

PM Modi Speech: మణిపూర్‌కు దేశం అండగా ఉంది.. భారత్‌ ప్రపంచ మిత్రుడుగా ఉద్భవించింది

Modi Speech

Modi Speech

PM Modi Speech: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వరుసగా 10వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పలు అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియా వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. గత పదేళ్లలో ఇండియా ఎంతో అభివృద్ధి సాధించిందని… దేశం కోసం వేలాది మంది బలిదానం ఫలితమే ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యమని మోడీ చెప్పారు. ప్రస్తుతం శాటిలైట్ రంగంలో ముందంజలో ఉన్న ఇండియా .. రానున్న కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీని శాసిస్తుందన్నారు. వ్యవసాయంలో సైతం దేశం ఇటీవలి కాలంలో చాలా అభివృద్ధి చెందిందని..సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయంలో అన్నదాతలు రాణిస్తున్నారని తెలిపారు. బారతదేశ డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయో డైవర్శిటీలు దేశానికి బలమని మోడీ చెప్పారు. గత పదేళ్లుగా దేశంలో ఏర్పడిన సుస్థిర ప్రభుత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తోందన్నారు. గతంలో అవినీతి కారణంగా దేశం చాలా నష్టపోయిందన్నారు. దేశంలో అత్యధికంగా ఉన్న మహిళా శక్తి, యువతతో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని మోడీ ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి ఎన్నో పాఠాలు నేర్పిందని..ఆ సంక్షోభం నుంచి అత్యంత త్వరగా కోలుకోవడం ద్వారా ప్రపంచదేశాలకు ఇండియా ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం స్టార్టప్ రంగంలో దేశం మూడవ స్థానంలో ఉండటం విశేషమన్నారు. గత పదేళ్లలో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో అందరికీ న్యాయం చేస్తున్నామన్నారు.

Read also: Tuesday Remidies: అదృష్టం కలిసిరావడం లేదా?.. మంగళవారం నాడు ఈ చర్యలు చేస్తే డబ్బే డబ్బు!

ప్రధాని మోడీ తన ప్రసంగంలో మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మణిపూర్‌లో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నామని..అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చెప్పారు. శాంతితోనే మణిపూర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ప్రధాని మోడీ.. ఆ దిశగా రాష్ట్రంలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొన్నిసార్లు చరిత్రలో చిన్న చిన్న సంఘటనలు దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తాయని అన్నారు. అన్నింటినీ సునిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ప్రపంచంలోని ఏ శక్తికీ ఇండియా భయపడదని, తలవంచదని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా త్వరలో మూడవ ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, వారసతక్వం, బుజ్జగింపు రాజకీయాల్ని నిర్మూలించాలని మోడీ పిలుపునిచ్చారు. టెక్నాలజీ సహాయంతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోందన్నారు. 75 ఏళ్లలో గొప్ప అభివృద్ధిని సాధించామని..ఇది రెట్టింపు కావాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also: Viral Video: నీ టేస్ట్ తగలెయ్యా.. చట్నీతో బొద్దింక తినడం ఏంటి..!

2047 నాటికి సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు. ఇండియా ప్రపంచ అభివృద్ధిలో కూడా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచంలో ప్రతి దేశం ఇండియాకు మిత్రదేశమేనని గుర్తుంచుకోవాలన్నారు. అనుకున్న సమయం కంటే ముందే దేశంలో అంతర్గత జల రవాణా మార్గాల నిర్మాణం పూర్తి కానుందని చెప్పారు. రానున్న కొత్త తరానికి నూతన భారతాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మహిళా స్వయం సహాయక బృందాలను ప్రధాని మోడీ ప్రశంసించారు. ‘‘నేడు 10 కోట్ల మంది మహిళలు మహిళా స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు. గ్రామాల్లో 2 కోట్ల ‘లఖపతి దీదీ’ నా కల’’ అని ప్రధాని మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు. వచ్చే ఆగస్టు 15న ఎర్రకోట నుండి దేశం సాధించిన విజయాల గురించి వివరిస్తాను. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న దేశాన్ని రాబోయే తరానికి మెరుగైన, సంపన్నమైన దేశాన్ని అందించాల్సిన పెద్ద బాధ్యత మనందరిపై ఉంది. అదనపు శక్తి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అది మహిళల నేతృత్వంలోని అభివృద్ధి. నేడు భారతదేశం అత్యధిక మహిళా పైలట్‌లను కలిగి ఉందని గర్వంగా చెప్పగలను. అది చంద్రయాన్ లేదా మూన్ మిషన్ అయినా.. మహిళలే కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు’’ అని మోదీ ఎర్రకోట వేదికగా తన ప్రసంగంలో పేర్కొన్నారు.