INDIA bloc: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత, ఇండియా కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంపై ఆప్, తృణమూల్ కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, మమతా బెనర్జీని ఇండియా కూటమి చీఫ్‌గా నియమించాలని తృణమూల్ ఎంపీ కీర్తి ఆజాద్ కొత్త చర్చని లేవదీశారు. ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు మమతా బెనర్జీ సరైన వ్యక్తి అని, ఆమెకు ఆ రికార్డు ఉందని అన్నారు.
Read Also: Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
‘‘మమతా బెనర్జీకి మోడీని ఎదుర్కోవడంలో మంచి రికార్డు ఉంది. నరేంద్రమోడీకి ప్రతీసారి పశ్చిమ బెంగాల్‌లో ఓటమి ఎదురైంది. ఇటీవల ఉప ఎన్నికల్లో మొత్తం 5 స్థానాలను టీఎంసీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్‌కి మోడీ వచ్చిన ప్రతీసారి మమతా బెనర్జీ ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆమె చాలా సీనియర్ నాయకురాలు, తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలరు’’ అని ఆజార్ అన్నారు.
అయితే, కీర్తి ఆజాద్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ మాణిక్క్ ఠాగూర్ మంగళవారం తిరస్కరించారు. ‘‘గుడ్ జోక్’’ అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల ఇండియా కూటమిలో చీలికలు కనిపిస్తున్నాయి. మంగళవారం గౌతమ్ అదానీ లంచం కేసులో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీలు కాంగ్రెస్ చేపట్టిన నిరసనలకు హాజరుకాలేదు. కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, శివసేన(యూబీటీ), వామపక్షాలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. ఈ నిరసనలకు టీఎంసీ, ఎస్పీ ఎంపీలు దూరంగా ఉన్నారు.