Un Known Men: పాకిస్తాన్‌లో మన ‘‘ధురంధరులు’’ రెచ్చిపోతున్నారు. అక్కడి ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారు, భారత వ్యతిరేకులు వరసగా ‘‘గుర్తుతెలియని వ్యక్తుల’’ చేతిలో హత్యకు గురవుతున్నారు. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్‌లో ఇప్పుడు వారు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. గత కొంత కాలంగా పాకిస్తాన్‌లోని ఏ ప్రావిన్సులో నక్కినా కూడా ఉగ్రవాదులు ఖతమైపోతున్నారు. కరాచీ, లాహోర్, పెషావల్, డేరా ఘాజీ ఖాన్, క్వెట్టాలలో ఎక్కడ ఉన్నా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఉగ్రవాదుల ఖతమవుతున్నారు.
తాజాగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ బావమరిది అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం గుండెపోటుతో లాహోర్‌లో మరణించాడు. డయాబెటిస్‌తో బాధపడుతున్న మక్కీ గత కొంత కాలంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు లష్కరే అనుబంధ సంస్థ జమాత్ ఉద్ దావా ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఇతడి మరణం వెనక కూడా ‘‘గుర్తు తెలియని వ్యక్తులు’’ ఉన్నారనే ప్రచారం ఉంది.
రహమాన్ మక్కీ 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత అమెరికా, ఐక్యరాజ్య సమితి చేత ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. అరబిక్ మరియు ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉన్న ఆయన, సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న ఉమ్ అల్-ఖురా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. అయితే, ముంబై ఉగ్రవాద దాడుల్లో మక్కీ ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నా కూడా పాకిస్తాన్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. సయీద్‌తో కలిసి కాశ్మీర్ పేరుతో భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌ను మక్కీ ప్రోత్సహించాడు.
గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమైన ఉగ్రవాదులు వీరే:
* భారతదేశానికి చెందిన సరబ్‌జీత్ సింగ్‌ని పాకిస్తాన్ జైలులో చంపిన పాకిస్తాన్ అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌ని గుర్తు తెలియని వ్యక్తులు 2024లో కాల్చి చంపారు. లాహోర్‌లో ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి షూట్ చేయడంతో అమీర్ హతమయ్యాడు.
*నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ముజామిల్, నయీమూర్ రెహ్మన్‌లను సియాల్‌కోట్ నగరంలో హతమార్చారు. పోలీస్ యూనిఫాం ధరించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటన 2023 నవంబర్‌లో జరిగింది.
*2023లో జైషే ఉగ్రవాది మసూద్ అజార్ కి అత్యంత సన్నిహితుడైన మౌలానా రహీం ఉల్లా తారిఖ్‌ని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అంతకుముందు జమ్మూలోని సుంజువాన్ ఆర్మీ క్యాంప్‌పై 2018 దాడికి సూత్రధారి అని నమ్ముతున్న ఖ్వాజా షాహిద్ అనే ఉగ్రవాదిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK) లో కిడ్నాప్ చేసి, తల నరికి చంపేశారు. అక్టోబరులో, మసూద్ అజార్ యొక్క విశ్వసనీయ సభ్యుడిగా కూడా పరిగణించబడే దౌద్ మాలిక్, వజీరిస్థాన్‌లో పట్టపగలు హత్య చేయబడ్డాడు. వీరే కాకుండా జమాతే ఉద్ దావా, లష్కర్ ఉగ్రవాది హఫీస్ సయీద్ అత్యంత సన్నిహితుడు మాలిక్, ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ని కూడా గత నెలలో ఇలాగే హత్యలు చేశారు.
* 2025లో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)లో క్రియాశీల సభ్యుడు, కమాండర్‌గా ఉన్న షేక్ మోయిజ్ ముజాహిద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ సిటీలో ముజాహిద్ ఇంటి వెలుపల ఈ సంఘటన జరిగింది.
* 2025లో పాక్‌లోని దిర్‌లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ హబీబుల్లా హక్కానీని అతిదగ్గర నుంచి కాల్చి చంపారు.
* 26/11 ముంబై దాడులకు కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ బంధువు, లష్కరే తోయిబా నిధుల సేకరణకు సంబంధించిన ఖారీ షాజాదాను 2025లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీ నగరంలోని ఖైరాబాద్ ప్రాంతంలోని జామియత్ ఉలేమా ఇస్లాం అనే సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఖారీ షాజాద్‌ని స్థానిక మసీదు సమీపంలో కాల్చి చంపారు.
* టెర్రరిస్ట్ జహూర్ మిస్త్రీ, ఐసీ-814 విమానం హైజాక్ లో కీలకంగా పాల్గొన్న ఉగ్రవాదిని 2022లో కరాచీలో కాల్చి చంపారు. అబూ సైఫుల్లా కాలిద్ 2006లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి చేశాడు, ఇతడిని 2025లో అన్ నోన్ వ్యక్తులు హతం చేశారు. హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి, ముంబై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఇతడు 2023లో జైలులో మరణించాడు
*2025లో లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రసంస్థకు ఫైనాన్షియర్‌గా, 26/11 ఉగ్రవాదుల సూత్రధారి హఫీస్ సయీద్ సన్నిహితుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతుడిని అబ్దుల్ రెహమాన్‌గా గుర్తించారు.
* వీరే కాకుండా 2023 కరాచీలో లష్కర్ ఉగ్రవాది రియాజ్ అహ్మద్ హతమ్యాడు, జియా ఉర్ రెహ్మాన్ ను కరాచీలో 2023లో చంపేశారు. నూర్ అహ్మద్ ను 2024 కరాచీలో చంపేశారు. షహీద్ లతీఫ్ అనే జైషే ఉగ్రవాదిని సియాల్ కోట్ మసీదులో కాల్చి చంపారు. అబూ కాసిమ్ కాశ్మీరీ అనే ఉగ్రవాదిని రావల్పిండితో గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.
