Site icon NTV Telugu

CM KCR: దేశ రాజకీయాల కోసం ప్రాంతీయ పార్టీ నేతలను కలుస్తా

ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయాలపై మహారాష్ట్ర సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని.. దేశంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏక‌తాటిపైకి రావాల్సిన స‌మ‌యం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక అవ‌స‌రం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చ‌ర్చ‌లు ఆరంభం మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ అన్నారు. మున్ముందు పురోగ‌తి వ‌స్తుంద‌ని.. త్వరలోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌లో పూర్తిస్థాయి సమావేశం ఉంటుందన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు అనేక విషయాల్లో కలిసి పనిచేయాల్సి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. తమ ఇద్దరి చర్చల ఫలితాలను త్వరలోనే చూస్తారని ఆయన వెల్లడించారు. కేంద్ర సంస్థ‌ల‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని… ఈ వైఖ‌రి మార్చుకోకుంటే బీజేపీకి భవిష్యత్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వు అని సీఎం కేసీఆర్ హెచ్చ‌రించారు.

Exit mobile version