Site icon NTV Telugu

Tejashwi Yadav: ఆ పరిస్థితి వస్తే ఎన్నికల్లో పోటీ చేయను.. తేజస్వి యాదవ్ హెచ్చరిక

Tejashwi Yadav

Tejashwi Yadav

ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఇండియా కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. ఒక జాతీయ మీడియాకు తేజస్వి యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ముఖం లేకుండా కూటమి ఎన్నికల్లో పోటీ చేయడమేంటి? అని ప్రశ్నించారు. అయినా ముఖాలు లేని బీజేపీ వాళ్లమా? ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తామంటూ పేర్కొన్నారు. గత నెలలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. దానికి అనుబంధంగా.. రాహుల్‌గాంధీ తిరగని ప్రాంతాల్లో తేజస్వి యాదవ్ యాత్ర కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: H 1B Visa Fees: భారతీయులపై ట్రంప్ పిడుగు.. H-1B వీసా కొత్త దరఖాస్తులకు రూ. 88 లక్షలు

ఆ మధ్య కాలంలో రాహుల్ గాంధీ-తేజస్వి యాదవ్ కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా తేజస్వి యాదవ్.. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ రాహుల్‌గాంధీ మాత్రం.. తేజస్వి యాదవ్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని మాత్రం ప్రకటించలేదు. నోరు మెదపలేదు. ఈ అంశంపై మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘కొంచెం ఆగండి.. ముఖ్యమంత్రిని నిర్ణయించేది ప్రజలే. ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం ఉండటం ప్రధానం కాదు. మనం బీహార్‌ను నిర్మించాలి.’’ అని తేజస్వి యాదవ్ కవర్ చేశారు. సీట్ల పంపకం పూర్తయ్యాక ఈ సమస్యను కూడా పరిష్కరించుకుంటామని.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా మాత్రం తాను పోటీ చేయబోనని నొక్కి చెప్పారు.

ఇది కూడా చదవండి: Poker Players: ఒరేయ్ ఆజాము లగెత్తరోయ్.. చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు.. డ్రోన్ ను చూసి..

త్వరలో బీహార్‌ ఎన్నికల షెడ్యూల్ రానుంది. వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. 2-3 దశల్లో పోలింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీపావళి నాటికి మాత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Exit mobile version