Site icon NTV Telugu

India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..

India On Trump

India On Trump

India on Trump: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ఏర్పాడ్డాయి. భారత దాడితో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, రెండు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత, ఆయన మరో వింత వాదన చేశారు. ‘‘యుద్ధం ముగించకుంటే సుంకాల పేరుతో బెదిరింపుతోనే అమెరికా మధ్యవర్తిగా భారత్-పాక్ మధ్య కాల్పులు విరమణ కుదిరింది’’ అని చెప్పాడు.

తమ సుంకాల బెదిరింపు రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి సహాయపడిందని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం ముందు చెప్పింది. ట్రంప్ ప్రతిపాదించిన విస్తృత సుంకాలపై చట్టపరమైన ఎదురుదెబ్బ తగలకుండా ఉండటానికి అతడి అధికారులు కోర్టు ముందుకు చివరి ప్రయత్నంగా ఈ విషయాన్ని తీసుకువచ్చారు. “అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే ప్రతికూల తీర్పు భారతదేశం మరియు పాకిస్తాన్‌లు ట్రంప్ ఆఫర్ చెల్లుబాటును ప్రశ్నించేలా చేస్తుంది, ఇది మొత్తం ప్రాంతం యొక్క భద్రతకు మరియు లక్షలాది మంది జీవితాలకు ముప్పు కలిగిస్తుంది” అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కోర్టుకు తెలిపారు.

Read Also: DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..

అయితే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాతో చర్చల సందర్భంగా సుంకాల అంశం ప్రస్తావనకు రాలేదని భారత్ తన వైఖరిని గురువారం పునరుద్ఘాటించింది. డొనాల్డ్ ట్రంప్, ఆయన పరిపాలన చెప్పినవంతా అబద్ధాలే అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పరోక్షంగా చెప్పింది. ‘‘ఈ ప్రత్యేక అంశంపై భారత్ వైఖరిని వ్యక్తీకరించాం. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న విరమణ సమయం వరకు, భారతదేశం మరియు అమెరికా మధ్య సంభాషణ జరిగింది. చర్చ సమయంలో సుంకాల అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు’’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ దాడికి ప్రతీకారంగా, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాక్, పీవోకేలోని 09 ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం, భారత్‌ లోని మిలిటరీ, సివిల్ ఆస్తులపై దాడులకు తెగబడింది. దీనికి అంతే ధీటుగా భారత్ పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌బేస్‌లపై దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది.

Exit mobile version