Tamil Nadu: తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, అధికార డీఎంకేని గద్దె దించే లక్ష్యంతో బీజేపీ, ఏఐడీఎంకేలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తు ఉంటుందని ఈపీఎస్ స్పష్టంగా చెప్పక పోయినప్పటికీ, 2026 ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశమే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. డీఎంకేని ఓడించడానికి ఏ పార్టీతో అయినా చేతులు కలుపుతామని బీజేపీ తమిళనాడు యూనిట్ ఛీప్ అన్నామలైతో పాటు, పళనిస్వామి కూడా ఇదే విషయాన్ని చెబుతుండటం చూస్తే, రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే ఛాన్సులే ఉన్నాయి.
మంగళవారం ఏఐఏడీఎంకే నేతలు, అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత, పళని స్వామి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలను రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే, 2023లో బీజేపీ, ఏఐడీఎంకేతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. ఇది బీజేపీ కన్నా, ఏఐడీఎంకేకి నష్టం కలిగింది. బీజేపీ సొంతగా తమిళనాడులో ఎదగాలని భావిస్తోంది.
విడిపోయి ఓడిపోయారు..
2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఏఐఏడీఎంకే, బీజేపీ వేరువేరుగా పోటీ చేశాయి. ఎఐఎడిఎంకె దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డిఎండికె) మరియు పుతియా తమిళగం (పిటి)తో కలిసి ఎన్నికలలో పోటీ చేసింది. బీజేపీ మొదటిసారిగా చిన్న పార్టీలను చేర్చుకుని ఒంటరిగా తొలిసారి పోటీలో దిగింది. ఈ ఎన్నికల్లో ఏఐడీఎంకే కూటమికి 23 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ పీఎంకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK), GK వాసన్‌కి చెందిన తమిళ్ మానిల కాంగ్రెస్ (మూపనార్) పార్టీలతో చేతులు కలిపి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఏకంగా 18 శాతం ఓట్లను సాధించింది. మరికొన్ని చిన్న పార్టీలు బీజేపీ పార్టీ గుర్తుపై పోటీ చేశాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీ బలం ఏఐడీఎంకేకి తెలిసి వచ్చింది. ఓట్ల విభజన కారణంగా డీఎంకే రాష్ట్రంలోని 39 సీట్లను గెలుచుకుంది. ఒకవేళ బీజేపీ, ఏఐడీఎంకే కలిసి పోటీ చేసి ఉంటే..అరణి, చిదంబరం, కోయంబత్తూర్, కడలూరు, ధర్మపురి, కళ్లకురిచ్చి, కృష్ణగిరి, నామక్కల్, సేలం, తెన్కాసి, తిరుప్పూర్, విలుప్పురం, విరుదునగర్ సహా కనీసం 12 లోక్‌సభ స్థానాలను గెలుచుకునేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.