Site icon NTV Telugu

Ukraine War : రష్యాతో యుద్ధం చేస్తున్న తమిళ బిడ్డ

జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. కానీ కొన్ని అవకాశాలు అనుకోని వరంలా వచ్చిపడతాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్‌ రవిచంద్రన్‌ విషయంలో కూడా అదే జరిగింది. సాయినికేష్‌ ఇండియన్‌ ఆర్మీలో చేరాలనుకున్నాడు. రెండు సార్లు ప్రయత్నించాడు. కానీ రెండు సార్లూ విఫలమయ్యాడు. తరువాత అమెరికా సైన్యంలో అయినా చేరుదామనుకుని చెన్నయ్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ని సంప్రదించాడు. అక్కడా అతనికి నిరాశే ఎదురైంది. దాంతో అతడు పై చదువుల కోసం 2018లో ఉక్రెయిన్‌ వెళ్లాడు. అక్కడి నేషనల్ ఏరో స్పేస్ విశ్వవిద్యాలయంలో ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరాడు. మరో మూడు నాలుగు నెలల్లో అతని చదువు పూర్తవుతుంది. కానీ ఇంతలో యుద్దం వచ్చిపడింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో విరుచుకుపడింది. రష్యా చేస్తున్న విధ్వంసం చూసి సాయినికేష్ రక్తం సలసల మరిగింది. ఆర్మీలో చేరి ఆయధం పట్టాడు.

యుద్ద నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్రం స్వదేశం తరలించే కార్యక్రమం చేపట్టింది. ఆపరేషన్‌ గంగలో భాగంగా తమ బిడ్డ కూడా తిరిగివస్తాడని సాయినికేష్‌ తల్లిదండ్రులు ఎదురుచూశారు. కానీ అతడు రాలేదు. సాయినికేష్ రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్‌ ఆర్మీలో చేరాడు. ఇప్పుడు ఈ వార్త భారత్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

సాయినికేష్ ఇండియా రాకుండా అక్కడే ఉండిపోవటంతో కుటుంబసభ్యులలో ఆందోళన మొదలైంది. ఫోన్లో కూడా వారికి అందుబాటులో లేకపోవటంతో ఆందోళన మరింత పెరిగింది. కొడుకు ఆచూకి తెలుపమని భారత విదేశాంగ శాఖ అధికారులను సంప్రధించారు. దాంతో అధికారులు సాయినికేష్ కోసం ఆరా తీయటంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రెండు రోజుల క్రితం సీబీఐ అధికారుల బృందం సాయినికేష్ నివాసానికి వెళ్లి అతని వివరాలు సేకరించింది. అలాగే అతను ఉక్రెయిన్ మిలిటరీలో ఎందుకు చేరాడు అనే దానిపై కూడా ఆరా తీశారు. సాయినికేష్‌కు మిలటరీలో పనిచేయటం అన్నా , సాయుధ శిక్షణ అన్నా ఎంతో ఇష్టం. ఇంట్లో అతని గది నిండా ఆర్మీ ఆధికారుల ఫొటోలే. దీనిని బట్టి అతనికి మిలటరీ అంటే ఎంత పిచ్చో అర్థమవుతోంది.

యుద్ధం ప్రారంభం కావటానికి కొన్ని రోజుల ముందు సాయినికేష్‌ కుటుంబసభ్యులకు ఫోన్‌ చేశాడు. జులైలో కోర్సు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తవుతుందని, అక్కడే ఓ వీడియో గేమ్ డెవలపింగ్ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చిందని చెప్పాడు. తరువాత అతని నుంచి ఏ సమాచారం లేదు. ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పాకే వారికి తెలిసింది అతను ఉక్రెయిన్ దళాలలో చేరినట్లు. ప్రస్తుతం ఈ 21 ఏళ్ల తమిళనాడు నవ యువకుడు ఉక్రెయిన్‌ వాలంటీర్లతో కూడిన జార్జియన్ నేషనల్ లెజియన్ పారామిలిటరీ యూనిట్ తరపున రష్యాపై పోరాడుతున్నాడు. సాయినికేష్‌ విషయంలో మన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!!

https://ntvtelugu.com/vasireddy-padma-praised-the-ycp-government/
Exit mobile version