Tamil Nadu: లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్.. రేపు చెబుతామన్న వామపక్షాలు

  • తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి
  • లెఫ్ట్ పార్టీల మద్దతు కోరిన విజయ్
  • రేపు చెబుతామన్న వామపక్షాలు
Tvkvijay2

Tvkvijay2

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో దోబూచులాడుతోంది. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం గవర్నర్ ఆహ్వానించడం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది.

సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మాత్రమే 108 సీట్లు వచ్చాయి. అతి పెద్ద పార్టీగా అవతరించడంతో విజయ్‌నే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆహ్వానించవచ్చని అందరూ భావించారు. కానీ గవర్నర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. కాంగ్రెస ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ 113 ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేసినా గవర్నర్ ససేమిరా అన్నారు. కచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను తీసుకురావాల్సిందేనని హుకుం జారీ చేశారు. దీంతో విజయ్‌ తీవ్ర అయోమయంలో పడ్డారు.

గవర్నర్ వ్యవహారంపై టీవీకే పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. బలం చేకూర్చుకునేందుకు చిన్న పార్టీల మద్దతు తీసుకునేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతు కోరారు. ఈ పార్టీల దగ్గర ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ చిన్న పార్టీలు మద్దతు ఇస్తే.. సునాయసంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేశాయి. రేపు సమావేశమై మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని వామపక్షాలు తెలిపాయి. దీంతో ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో టీవీకే 108, డీఎంకే 59, ఏఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, సీవీకే 2, ముస్లిం లీగ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించింది. వామపక్షాలు మద్దతు ఇస్తే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈజీ అవుతుంది. ఏం జరగబోతుందో రేపు తేలిపోనుంది.