Site icon NTV Telugu

Juice diet: ప్రాణాలు తీసిన ‘‘జ్యూస్-డైట్’’.. ఆరోగ్యం క్షీణించి బాలుడు మృతి..

Juice Diet

Juice Diet

Juice diet: కఠినమైన ‘‘డైట్’’ ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో తెలుసుకోవడానికి ఈ ఘటనే నిదర్శనం. డాక్టర్లు, పోషకాహార నిపుణుల సలహాలు లేకుండా, మూడు నెలలుగా కేవలం ‘‘జ్యూస్’’లు తాగుతూ డైట్ పాటించిన 17 ఏళ్ల కుర్రాడు మరణించాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కొలాచెన్‌లో జరిగింది. మృతుడు శక్తిశ్వరన్, గత మూడు నెలలుగా తీవ్రమైన డైట్ ప్లాన్ లో ఉన్నట్లు కుటుంబీకులు చెప్పారు. అయితే, శక్తిశ్వరన్ ఆరోగ్యంగా, చురుగా ఉన్నాడని, అంతలోనే మరణించడంపై కుటుంబీకులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Read Also: Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..

యూట్యూబ్‌లో డైట్‌కు సంబంధించిన ఒక వీడియో చూసిన తర్వాత, శక్తిశ్వరన్ కేవలం పండ్ల రసాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఇటీవల, ఎక్సర్‌సైజ్ కూడా మొదలుపెట్టినట్లు మృతుడి బంధువులు చెప్పారు. ఆన్‌లైన్‌లో నియమాలను అనుసరించే ప్రయత్నంలో పూర్తిగా ఘన ఆహారం తీసుకోవడం మానేసినట్లు తెలుస్తోంది. గురువారం, అకస్మాత్తుగా శక్తిశ్వరన్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. కొద్దిసేపటికే మరణించాడు. అయితే, మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు శవపరీక్ష నివేదికను పరిశీలిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవకపోవడం వల్లే మరణించినట్లు ఇంకా వైద్యపరంగా ధ్రువీకరించలేదు.

గతంలో కూడా డైట్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 2025లో జరిగిన ఇలాంటి సంఘటనలో, కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల బాలిక శ్రీనంద మరణించింది. బరువు పెరుగుతున్నాననే భయంతో కఠినమైన ఆహార నియమాలు పాటించింది. ఆ తర్వాత తలస్సేరిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. బరువు పెరుగుతున్నాని, భోజనం మానేసి, తీవ్రంగా వ్యాయామం చేసేదని కుటుంబం చెప్పింది. దీని తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మరణించింది.

Exit mobile version