తమిళనాడులో ఇటీవల 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. కొత్తగా ఏర్పడిన విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి విజయ్ పోలీసులకు ఆదేశించారు. అయితే తాజాగా పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు నెట్టింట తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియా వేదికగా పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు.
మే 21న కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు సంచలనం సృష్టించింది. అయితే సోమవారం ఈ ఘటనపై పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. వెస్ట్ జోన్ ఐజీ ఆర్.వి. రమ్య భారతి, కోయంబత్తూరు రేంజ్ డీఐజీ పి. సమినాథన్, కోయంబత్తూరు ఎస్పీ అల్లటిపల్లి పవన్ కుమార్ రెడ్డి కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. అయితే ఒక సీరియస్ మేటర్‌పై ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నామన్న ఇంకిత జ్ఞానం లేకుండా.. ముగ్గురూ కూడా సాధారణ సంభాషణలో మునిగిపోయారు. అనంతరం జోకులు వేసుకుంటూ.. నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగానే.. వేగంగా వైరల్ అయింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
“ఇంత తీవ్రమైన కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా నవ్వడం ఏంటి? ఇది అసమర్థత” అని ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు “10 ఏళ్ల చిన్నారి హత్యపై ఇంత నిర్లక్ష్యమా? ఇది అతి అవమానకరం” అని పేర్కొన్నారు. మరికొందరు “ఇలాంటి అధికారులు ఈ పదవులకు అర్హులు కారు” అని విమర్శించగా.. “సివిల్ సొసైటీగా మనం విఫలమయ్యాం” అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో తమిళనాడు పరిశ్రమల మంత్రి ఎస్. కీర్తన కూడా ఈ కేసు నేపథ్యంలో విమర్శలకు గురయ్యారు. మీడియా ప్రశ్నలకు స్పందించిన సమయంలో ఆమె కూడా నవ్వినట్లు కనిపించడంతో బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయితే మీడియా సమావేశం ముగిసిన తర్వాతే ఆ నవ్వు వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు.
