Tamil Nadu: ఆంధప్రదేశ్, తమిళనాడు మధ్య పెట్టుబడుల పోటీ నెలకొంది. ఇటీవల కాలంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి తరలి వచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించిన రహస్య వివరాలను చేరవేశారనే అనుమానంతో ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ 15 మంది సీనియర్ అధికారులను తొలగించినట్లు తెలుస్తోంది. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు అధికారులు, ఆ తర్వాత డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ అదే పదవుల్లో కొనసాగారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కంపెనీల పెట్టుబడుల వివరాలు లీక్..?
తమిళనాడు పరిశ్రమ శాఖ పరిధిలో పనిచేసే టీమ్ ఈ సమాచార లీకేజ్ వ్యవహారాన్ని గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమిళనాడులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే కంపెనీలతో ప్రభుత్వం జరిపే చర్చలు, పెట్టుబడులకు సంబంధించిన సున్నిత సమాచారం లీకైనట్లు అనుమానిస్తున్నారు. ఈ వివరాలను ఏపీ అధికారులకు చేరవేసినట్లు విజయ్ సర్కార్ భావిస్తోంది. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన వీరిని జూలైలో విధుల నుంచి 15 మందిని తొలగించారు.
ఉద్యోగాల నుంచి తొలగించిన తర్వాత క్రిస్టో లారెల్, ప్రభాకరన్ అండి, ప్రీజా ప్రసాద్ అనే ముగ్గురికి ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలిలో ఉద్యోగాలు వచ్చాయి. వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ప్రత్యక్షం కావడంతో వీరి ఫోటోలు వైరల్గా మారాయి. తనపై కావాలనే డీఎంకే కుట్ర చేస్తోందని మంత్రి కీర్తన ఆరోపిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు దఫాల్లో చేసిన రివ్యూల్లో సమాచారం లీకేజీలో ఉద్యోగుల పాత్రపై అనుమానం వచ్చి తొలగించినట్లు ఆమె చెబుతున్నారు. తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులు ఏపీకి తరలిపోతున్నాయని మాజీ సీఎం స్టాలిన్ ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు.

