NTV Telugu Site icon

Tamil Nadu: గవర్నర్ సంచలన నిర్ణయం.. సీఎంకి చెప్పకుండానే క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీ తొలగింపు..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu:తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మరోసారి గవర్నర్, సీఎం ఎంకే స్టాలిన్ మధ్య ఘర్షణకు కారణం కాబోతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను సంప్రదించకుండానే తమిళనాడు గవర్నర్ సెంథిల్ బాలాజీని రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇటీవల మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల కాలంలో ఏ గవర్నర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.

జూన్ 14న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన బాలాజీ జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏఐడీఎంకే ప్రభుత్వంలో 2014లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న బాలాజీ ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత 2018లో డీఎంకే పార్టీలో చేరి గెలుపొంది, స్టాలిన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు.

Read Also: Alcohol: ఆల్కాహాల్ తాగే ముందు ఫుడ్ తినాలా..? తాగిన తర్వాత తినాలా..? ఏది బెటర్..?

సెంథిల్ బాలాజీ అరెస్ట్ సమయంలో తమిళనాడులో నానా హంగామా చోటు చేసుకుంది. ఆయనకు ఛాతి నొప్పిరావడంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ జరిగింది. సెంథిల్ బాలాజీ ప్రస్తుతం పోర్ట్ పోలియో లేకుండా మంత్రిగా ఉన్నారు. అతను నిర్వర్తించే శాఖల్ని మరోమంత్రి తంగం తెన్నరసు, ముత్తుసామిలు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే గవర్నర్ రవిపై డీఎంకే పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. గోబ్యాక్ రవి అంటూ గతంలో డీఎంకే ఏకంగా పోస్టర్లను కూడా వేసింది. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ఎలాంటి రాజకీయ దుమారానికి కారణం అవుతుందో చూడాలి.

Show comments