CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్‌ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..

Cm Vijay (1)

Cm Vijay (1)

CM Vijay Anti Corruption Drive: తమిళనాడులో తనదైన మార్క్‌ పాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి విజయ్‌.. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న మొత్తంలో అయినా లంచం డిమాండ్‌ చేసిన అధికారులపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వారికి రూ.1 లక్ష వరకు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచే సమాచారం సేకరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌, ఆన్‌లైన్‌ పోర్టల్‌, ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక, ఫిర్యాదు చేసే వ్యక్తుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం విజయ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. శాఖలో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి వ్యవహారాలపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు మూడు నెలల గడువు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పోలీస్‌, మున్సిపల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉందని సమాచారం. టెండర్లు, కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం విజయ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. “ప్రజల డబ్బు పవిత్రమైనది.. అవినీతి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అంటూ అధికారులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం.

‘క్లీన్ గవర్నెన్స్‌’నే తన ప్రభుత్వ ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం విజయ్‌ తాజా నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇక, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్‌.. అన్ని వర్గాలను కలుస్తున్నారు.. రాజకీయ నేతలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు ఇలా అందరినీ కలుస్తూ.. వారి సలహాలు తీసుకుంటున్నారు.. తాజాగా, ప్రభుత్వ అంబులెన్స్‌ను ప్రారంభించే ముందు.. ఆయనే ప్రత్యేకంగా దానిని పరిశీలించారు..