NTV Telugu Site icon

Tamil Nadu: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం.. పథకాన్ని ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu Breakfast Scheme: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారాన్ని అందించనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రంలోని 1 నుంచి 5వ తరగతి వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని’.. సీఎం స్టాలిన్‌ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలోనే విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

Read Also: FlipKart: మ్యాక్‌బుక్ ఆర్డర్ చేస్తే స్పీకర్ వచ్చింది.. డబ్బుల రిఫండ్ కు ఫ్లిప్ కార్ట్ నో చెప్పింది, ఎందుకంటే?

నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీంను ప్రారంభించిన సీఎం స్టాలిన్‌.. చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ వడ్డించిన ముఖ్యమంత్రి.. తాను కూడా చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు. చెన్నైలో స్టాలిన్‌ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని గతేడాది సెప్టెంబరులోనే ప్రకటించిన స్టాలిన్‌ సర్కారు.. ప్రయోగాత్మకంగా 1545 పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆకలి బాధలు లేకుండా పిల్లలు పాఠశాలలకు హాజరయ్యేలా చూడటంతో పాటు, రక్తహీనతను బాగా తగ్గించడం, పోషకాహార స్థితిని మెరుగుపర్చడం, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడం వంటి లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతమవడంతో ఇప్పుడు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 31,008 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరించారు. ఈ స్కూళ్లలో మొత్తం 15,75,900 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఇప్పుడు ఈ అల్పాహార పథకం అందుబాటులోకి రానుంది.