NTV Telugu Site icon

MK Stalin: కర్ణాటక ఓటమిని కప్పిపుచ్చడానికే రూ.2000 నోట్ల రద్దు..

Cm Stalin

Cm Stalin

MK Stalin: రూ. 2000 నోట్లను రద్దు చేస్తూ నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది తుగ్లక్ నిర్ణయమని, మరో విపత్తుకు నాంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అర్వింద్ కేజ్రీవాల్, మల్లికార్జున ఖర్గే వంటి వారు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Read Also: Manoj Bajpayee: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ హీరో’ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ట్విట్టర్ ద్వారా ఈ చర్యను విమర్శించారు. ‘‘500 అనుమానాలు, 1000 రహస్యాలు, 2000 తప్పులు, కర్ణాటక విపత్తును దాచడానికి ఒకే ఉపాయం’’ అంటూ రూ.2000 నోటు ఉపసంహరణపై తమిళంలో ట్వీట్ చేశారు. కర్ణాటక ఓటమిని దాచేందుకే బీజేపీ ఈ నోట్ల రద్దును తీసుకువచ్చిందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం 2016 నవంబర్ లో తీసుకున్న రూ. 500, రూ. 1000 నోట్ల ఉపసంహరణను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని జపాన్ వెళ్లినప్పుడల్లా నోట్ల రద్దు ఉత్తర్వులు జారీ చేసి వెళ్లిపోతారని, ఇది దేశానికి మేలు చేస్తుందా..? కీడు చేస్తుందా.? ప్రధానికి తెలియదని విమర్శించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీన్ని ‘‘100 కోట్ల భారతీయులకు ఇది బిలియన్ డాలర్ల మోసం అని, ఇప్పకైనా మేల్కొనండి, నోట్ల రద్దు కారణంగా మేం పడిన బాధలను మరిచిపోలేదు. ఈ బాధలను పెట్టినవారిని క్షమించకూడదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. రూ.2000 నోట్లను తీసుకురావడం ద్వారా అవినీతి ఆగిపోయిందని మొదట చెప్పారు.. ఇప్పుడు రూ. 2000 నిషేధించడం ద్వారా అవినీతి అంతం అవుతుందని అంటున్నారని, అందుకే విద్యావంతుడైన ప్రధాని ఉండాలని, నిరక్షరాస్యుడైన ప్రధానమంత్రికి ఏం చెప్పగలం, ప్రజానీకం ఇబ్బంది పడాల్సి వస్తుందని అని అన్నారు.

Show comments