తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాజకీయ శపథం చేశారు. గురువారం రాజకీయంగా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని సవాల్ విసిరారు. అన్నామలై ప్రకటనతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు 6 సార్లు కొరడాతో కొట్టుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా 48 రోజులు ఉపవాసం ఉండబోతున్నట్లు తెలిపారు. మరింత స్వరం పెంచి.. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తాను పాదరక్షలు ధరించనని శపథం చేశారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినిపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు బాధితురాలి ఫొటో, ఆమె వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిస్థితులు ప్రతిపక్షాలకు మరింత కోపం తెప్పించాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే ఇంటర్నెట్‌లో బాధితురాలి వివరాలు చక్కర్లు కొడుతున్నాయని మండిపడ్డాయి. విపక్షాల విమర్శలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బాధితురాలి వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్న వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో తమిళనాడు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిలయంగా, నేరస్థులకు స్వర్గధామంగా మారిందని విమర్శించారు. బాధితురాలి పేరు, ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించినందుకు రాష్ట్ర పోలీసులపై మండిపడ్డారు. ‘‘ఎఫ్‌ఐఆర్ పబ్లిక్ డొమైన్‌లోకి ఎలా ప్రవేశించింది? ఎఫ్‌ఐఆర్‌ను లీక్ చేయడం ద్వారా మీరు బాధితురాలి గుర్తింపును బయటపెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో బాధితురాలిని ప్రతికూలంగా చూపించారు. ఇలాంటి ఎఫ్‌ఐఆర్ రాసి లీక్ చేసినందుకు పోలీసులు, డీఎంకే సిగ్గుపడాలి’’ అని అన్నామలై ధ్వజమెత్తారు. నిర్భయ ఫండ్ ఎక్కడికి పోయింది? అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో సీసీటీవీ కెమెరా ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. అంతేకాకుండా డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తాను పాదరక్షలు ధరించనని ప్రకటించారు. డీఎంకే రాజకీయాలతో తాను విసిగిపోయానని.. తమిళనాడులో డర్టీ పాలిటిక్స్‌కు స్వస్తి పలకాలని అన్నారు. ‘‘ఇకపై ప్రజా నిరసనలు ఉండవు.. ఎందుకంటే మీరు నిరసనకు గుమిగూడిన బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్టు చేసి వారిని కళ్యాణ మండపంలో ఉంచుతారు. అందుకే రేపటి నుంచి కార్యకర్తల ఇళ్ల ముందు నిరసనలు చేపడతారు’’ అని అన్నామలై తెలిపారు.