Tamil nadu school girl dead: తమిళనాడు రాష్ట్రంలో వరసగా స్కూల్ విద్యార్థినుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. తాజాగా మరో స్కూల్ విద్యార్థిని ఇంట్లో శవమై కనిపించింది. శివకాశిలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయింది. పోలీసులు దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ ఘటన నిన్న(మంగళవారం) చోటు చేసుకుంది. అయితే విచారణ పూర్తయ్యే దాకా ఏం చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. బాలిక తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. అయితే ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే తరుచూ కడుపునొప్పితో బాధపడుతోందని అధికారులు చెబుతున్నారు.
కడలూర్ జిల్లాలో 12వ తరగతి విద్యార్థిని చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకాశిలో విద్యార్థిని మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు రెండు వారాల్లో రాష్ట్రంలో ముగ్గురు 12 తరగతి విద్యార్థినిలు, తాజాగా 11 తరగతి చదువుతున్న విద్యార్థిని మరణించింది. కడలూర్ విద్యార్థిని తల్లిదండ్రుల ఐఏఎస్ కల నెరవేర్చలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. రాష్ట్రంలో జరుగుతున్న స్కూల్ విద్యార్థినుల మరణాల పట్ల సీఎం ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని కోరారు. పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని.. విద్యార్థినులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read Also: National Herald Case: సోనియా గాంధీ మూడో రోజు విచారణ.. ఢిల్లీలో భారీ బందోబస్త్
ఈ నెల 13న కల్లకురిచి విద్యార్థిని అనుమానాస్పద మృతితో రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది. ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని మరణం తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ తో సహా ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం సోమవారం తిరువళ్లూర్ జిల్లాలోని సేక్రెడ్ హార్ట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన హాస్టల్ గధిలో శవమై కనిపించింది. ఆ తరువాత కడలూర్, శివకాశి ఘటనలు జరిగాయి. విద్యాసంస్థల్లో జరుగుతున్న మరణాలపై సీబీ-సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.